లాడ్జీల్లో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

లాడ్జీల్లో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

నిర్మల్, వెలుగు: లాడ్జీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్​టౌన్ సీఐ ఎం.ప్రవీణ్ కుమార్ తెలిపారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన విశ్వనాథ్, రాము అనే ఇద్దరు పెయింటింగ్ పని కోసం నిర్మల్ కు వచ్చారు. జల్సాలకు అలవాటు వీరు పెయింటింగ్ పనులతో వచ్చే డబ్బులు సరిపోక చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. బళ్లారిలో పరిచస్తుడు బసవరాజు ఓ లాడ్జిలో పనిచేస్తూ కస్టమర్ల వివరాలతో ఉన్న రిజిస్టర్ ఆధారంగా వారికి ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడన్న విషయం తెలుసుకొని తాము కూడా అలాగే చేయాలనుకున్నారు. 

ఈ నెల 27న నిర్మల్​లోని సత్యం లాడ్జిలోకి  ప్రవేశించి అక్కడి రిజిస్టర్ తో పాటు కౌంటర్​లోని రూ.2 వేలు దొంగిలించారు. నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని విచారించారు. నిందితులు ఇప్పటికే వరంగల్, అదిలాబాద్ తదితర పట్టణాల్లోని లాడ్జిల్లో రిజిస్టర్లను చోరీ చేసినట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఓ విజిటర్ రిజిస్టర్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.