అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

లక్సెట్టిపేట వెలుగు: అక్రమంగా వ్యాపారం చేస్తూ అధిక వడ్డీల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని లక్సెట్టిపేట సీఐ నరేందర్ హెచ్చరించారు. రామగుండం సీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆదివారం మండలంలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, చిట్టీలు నిర్వహిస్తున్న వారి ఆఫీసులు, ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 

వడ్లవాడకు చెందిన ఒకరి వద్ద రూ.26.55 లక్షల విలువైన 31 ప్రామిసరీ నోట్లు, రెండు చెక్కులు.. తిమ్మాపూర్ లోని మరొకరి వద్ద 38 బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలని సూచించారు. స్థానిక ఎస్ఐ చంద్రకుమార్, దండేపల్లి ఎస్ఐ స్వరూప్ రాజ్, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు.