మెదక్ టౌన్, వెలుగు : బంగారు దుకాణంలో నగలు చోరీ చేసిన కేసులో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు. సోమవారం మెదక్ పీఎస్‌లో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న పట్టణంలోని మెహతాబ్ జువెల్లరీ దుకాణంలోకి నలుగురు మహిళలు వెళ్లి యజమాని మహ్మద్ షకీల్అహ్మద్ను మాటల్లో పెట్టి ముప్పై గ్రాముల బిస్కెట్ బంగారం, నాలుగు జతల కమ్మలను దోచుకెళ్లారు. సీసీ టీవీలో గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాళ్లు మళ్లీ దుకాణానికి రాగా యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన టౌన్ ఎస్సై లింగం, సిబ్బందితో కలిసి రాందాస్ చౌరస్తాలో నలుగురిని అరెస్టు చేసి, నగలుస్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారు ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నానికి చెందిన బాలసాని వెంకటరామవ్వ, బొజ్జాని నాగేంద్రమ్మ, బొజ్జగాని ధీనమ్మ, నల్లబోతుల వెంకటమ్మగా గుర్తించామని చెప్పారు. కేసు చేధించిన ఎస్సై లింగం, కానిస్టేబుళ్లు సాయిబాబాగౌడ్, శివరాజ్గౌడ్, గంగరాజు, రవి, రాజులను సీఐ అభినందించారు.