హైదరాబాద్: నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులైన 12మందిని అధికారులు అరెస్టు చేశారు. ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్టులు పొందినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కొందరు విదేశీయులకు నకిలీ పాస్ పోర్టులను కూడా ఇప్పించినట్లు గుర్తించారు.
కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టారు అధికారులు. నకిలీ పాస్ పోర్టులు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పలువురు ఎస్బి, పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.