బ్లాక్ ​లిస్ట్ లో హాస్పిటళ్లు..అందని సీఎంఆర్​ఎఫ్​ ...ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా!

బ్లాక్ ​లిస్ట్ లో హాస్పిటళ్లు..అందని సీఎంఆర్​ఎఫ్​ ...ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా!
  • ఆర్​ఎంపీల ద్వారా పేషెంట్లకు వల 
  • సీఎంఆర్ఎఫ్​ రాకపోవడంతో బాధితుల ఆందోళన
  • దొంగ బిల్లుల కారణంగా 21 ఆస్పత్రులపై సీఐడీ కేసులు 

సూర్యాపేట జిల్లా రావిపహాడ్​ కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఐదు నెలల కింద ఆర్​ఎంపీ ద్వారా ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పెద్ద పేగుకు క్యాన్సర్​ రావడంతో క్లినికల్ అంకాలజీ విభాగంలో చికిత్స చేశారు. మూడ్రోజుల పాటు చికిత్స చేసి రూ.3 లక్షల వరకు బిల్లు వసూలు చేశారు. ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్​ కోసం అప్లయ్​ చేసుకునేందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఆస్పత్రి బ్లాక్​ లిస్ట్ లో ఉన్న సంగతి బయటపడింది. ఈ విషయం తమకు చెప్పకుండా ఆస్పత్రి మేనేజ్ మెంట్, ఆర్​ఎంపీ మోసం చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 

ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నాయి. రెండేళ్ల కింద సీఎం రిలీఫ్​ ఫండ్​ కోసం దొంగ బిల్లులు పెట్టిన వ్యవహారం బయటపడగా, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఆస్పత్రులు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ బ్లాక్​ లిస్టులో పెట్టి ఎంక్వైరీ చేస్తోంది. 

ఈ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేషెంట్లు సీఎంఆర్​ఎఫ్​ కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎంపీల క్యాంప్​ ఆఫీసుల్లో కూడా ఈ ఆస్పత్రుల జాబితాను గోడపై అంటించారు. కానీ బ్లాక్​ లిస్ట్ లో ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం చికిత్స కోసం వస్తున్న పేషెంట్లకు విషయాన్ని చెప్పకుండా మోసం చేస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్​ కోసం బిల్లులు కావాలని అడిగితే విషయాన్ని దాచిపెట్టి కొందరు బిల్లులు ఇస్తుండగా, మరికొందరు బిల్లులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆస్పత్రి బ్లాక్​ లిస్ట్ కారణంగా ఎమ్మెల్యేలు వాటిని రిజెక్ట్ చేస్తుండడంతో పేషెంట్లు  ఇబ్బంది పడుతున్నారు. 

ఆర్​ఎంపీలే ఏజెంట్లు!

ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులు చాలా వరకు ఆర్​ఎంపీల ద్వారా వస్తున్న కేసులపైనే ఆధారపడుతున్నాయి. ఆర్​ఎంపీలకు ఫీజులో 40 నుంచి 50 శాతం వరకు కమీషన్​ ఇస్తుండడంతో వాళ్లే మార్కెటింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్​ఎంపీల ద్వారా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పేషెంట్లను వారి ఆస్పత్రులకు రప్పించుకుంటూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కమీషన్ల కోసం బ్లాక్​ లిస్ట్ లో ఉన్న ఆస్పత్రులకు కూడా ఆర్​ఎంపీలు పేషెంట్లను తరలిస్తున్నారు. 

ఆఫీసర్ల పర్యవేక్షణ కరువు.. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న మోసాలపై పర్యవేక్షించాల్సిన వైద్యారోగ్య శాఖలో మూడు నెలల్లోనే ముగ్గురు డీఎంహెచ్​వోలు మారారు. ముందుగా డీఎంహెచ్ వోను కలెక్టర్​ సరెండర్​ చేయగా, ఆ తర్వాత మరో అధికారి రెండు నెలల పాటు ఇన్​చార్జిగా వ్యవహరించారు. తాజాగా ఇంకో ఆఫీసర్​ కు ఇన్​చార్జిగా డీఎంహెచ్​వోగా బాధ్యతలు ఇచ్చారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

బిల్లులు అడిగితే దాడి చేశారు

ఖమ్మం రూరల్​ మండలం కామంచికల్ కు చెందిన బాధితురాలు బాల నాగమణి మంగళవారం ఖమ్మంలోని ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. ‘కుటుంబంలో గొడవల కారణంగా గత నెల 8న పురుగుల మందు తాగిన. ఫస్ట్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆర్ఎంపీ చెప్పడంతో ఖమ్మంలోని శ్రీ వినాయక హాస్పిటల్ లో జాయిన్​ అయ్యా. నాలుగు రోజులకు కోలుకున్నానని చెప్పారు. మరుసటి రోజు డిశ్చార్జి చేస్తామని చెప్పి సడన్​ గా లివర్​ డ్యామేజీ అయిందని, హైదరాబాద్​ తీసుకెళ్లాలని అన్నరు.

అప్పటికే ఆ దావాఖానలో రూ.2.50 లక్షలు కట్టాం. ఆ బిల్లులు ఇవ్వాలని అడిగితే హాస్పిటల్​వాళ్లు మా దాడి చేసి, కేసులు పెట్టారు. తర్వాత హైదరాబాద్​ లో ఆస్పత్రికి వెళ్తే మరో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యింది. సీఎంఆర్ఎఫ్​ కోసం అప్లయ్​ చేసుకుందా మంటే వినాయక ఆస్పత్రికి స్కీమ్​ ను రద్దు చేసినట్టు తెలిసింది. మాయమాటలు చెప్పి ట్రీట్ మెంట్ పేరుతో డబ్బులు కాజేసిన ఆ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె కోరారు. ఈ విషయమై వినాయక హాస్పిటల్​ యాజమాన్యం స్పందిస్తూ తమ ఆస్పత్రిని బ్లాక్​ లిస్టులో పెట్టిన విషయం తెలియదని, అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. తమ హాస్పిటల్​లో పేషెంట్ డిశ్చార్జి అయిన తర్వాత అడిగితే సీఎంఆర్ఎఫ్​ ఫార్మాట్ లో బిల్లులు ఇస్తున్నామని చెప్పింది.