బీఆర్ఎస్​ చేసిన సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్​అలీ

బీఆర్ఎస్​ చేసిన సర్వేపై సీఐడీ విచారణ  జరిపించాలి: షబ్బీర్​అలీ

హైదరాబాద్ , వెలుగు : 2014 సమగ్ర కుటుంబ సర్వే, ఇంటెన్సివ్ హౌస్‌‌హోల్డ్ సర్వే(ఐహెచ్ఎస్)​లో అక్రమాలపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రికి రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు. ప్రధానంగా తెలంగాణలో 2014 ఆగస్టు 19న అప్పటి టీఆర్‌‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌‌ఎస్) ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో 'సోకాల్డ్' సర్వే నిర్వహించిందన్నారు. 

ఇందుకోసం పోలీసు సిబ్బందితో సహా దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను సమాచార సేకరణకు వినియోగించిప్పటికీ అనేక అవకతవకలు, ఆందోళనలను కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) 'ఇంటెన్సివ్ హౌస్‌‌హోల్డ్ సర్వే (ఐహెచ్​ఎస్) 2014' పేరుతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కులాల జనాభాకు సంబంధించి తప్పుడు వివరాలతో పాటు తప్పుదారి పట్టించే సమాచారంతో సర్క్యులేట్ అవుతుండంపై ప్రత్యేకించి దృష్టికి తీసుకువస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

అయితే, ప్రస్తుత బీసీ కుల గణన విడుదల చేసిన నేపథ్యంలో అశాంతి, గందరగోళాన్ని సృష్టించేందుకు వివిధ కులాల కల్పిత ఫొటోలతో ఓ పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందన్నారు.