హైదరాబాద్, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రీజనల్ సీఐడీ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్థానిక సీఐడీ డీఎస్‌పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసిన 28 హాస్పిటల్స్ వివరాలు సేకరిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి సేకరించిన లబ్ధిదారుల వివరాల ఆధారంగా హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ పొందినట్లుగా పేర్కొన్న పేషెంట్స్ ను గుర్తిస్తున్నారు. హాస్పిటల్స్‌లో ఇప్పటికే సీజ్ చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. పేషెంట్స్ ట్రీట్‌మెంట్ పొందినట్టు రికార్డ్ చేసిన డేటాతో పాటు కేస్ షీట్స్, బిల్స్ ఆ తరువాత సీఎంఆర్‌ఎఫ్ విభాగానికి పంపిన బిల్స్, సాంక్షన్ అయిన రిలీఫ్ ఫండ్ వివరాలను సేకరిస్తున్నారు.