హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అరెస్ట్ చేయగా.. ఈ వివరాలను సీఐడీ చీఫ్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని చాణిక్య ఆసుపత్రిలో ఆర్‌ఎంపీ గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సూపర్ వైజర్ ఎల్.సైదిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ కింద రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పలు ఆసుపత్రుల నుంచి అందిన దరఖాస్తుల్లో అవకతవకలు జరిగినట్టు రెవెన్యూశాఖ అధికారులు ఆగస్టు 23న సీఐడీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు నల్లగొండ నుంచి వచ్చిన సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుల్లో నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వాన్ని మోసగించినట్టు గుర్తించారు. కంప్యూటర్ల ద్వారా నిందితులు నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించారని, హాస్పిటల్స్, డాక్టర్ల పేరిట నకిలీ రబ్బర్ స్టాంప్‌లను సైతం తయారు చేయించినట్టు తేలింది.
ఒక్కో ఫేక్ సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తు తయారీ కోసం రూ.4 వేలు కమీషన్ తీసుకున్నట్టు ఆధారాలు దొరికాయి. ఇలా నల్లగొండలోని అమ్మ హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరిట19 నకిలీ దరఖాస్తులను సీఎంఆర్‌ఎఫ్‌కు పంపినట్టుగా గుర్తించారు. నిందితుల నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, రబ్బరు స్టాంపులు, నవీన ఆసుపత్రి పేరిట ఉన్న లెటర్ హెడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇతర నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.