ఖమ్మం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక అక్రమాలు, నేరాలపై సీబీసీఐడీ ఎంక్వైరీ జరిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పొంగులేటి చేసిన ఆర్థిక నేరాలు, భూ దందా వివరాలను త్వరలోనే బయటపెడతామన్నారు. డీసీసీబీ బ్యాంక్ ను ముంచిన ఆర్థిక నేరగాడిని పక్కన పెట్టుకొని పొంగులేటి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్లాగా, పొంగులేటి కూడా ఆర్థిక నేరగాడేనని అన్నారు.
‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాగార్జున సాగర్ కాల్వ పనుల్లో సిమెంట్ పోశావా.. బూడిద పోశావా, అందుకు సహకరించిన అధికారులకు నువ్వు చేసిన ఆర్థిక లబ్ధి ఏంటి? అనేది సమయం వచ్చినపుడు బయటపెడతాం. నీకు వరసకు సోదరుడు అయిన వ్యక్తి అప్పుడు నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసింది నిజం కాదా’ అని ప్రశ్నించారు. ఖమ్మం మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు నాగరాజు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు పాల్గొన్నారు.