![హైదరాబాద్ శివార్లలో 2 వేల ఎకరాల్లో సినిమా సిటీ](https://static.v6velugu.com/uploads/2020/11/outskirts.jpg)
హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తం: సీఎం
షూటింగ్‌లు స్టార్ట్ చేసుకోండి
బల్గేరియా వెళ్లి సినిమా సిటీని పరిశీలించి రండి
ప్రగతి భవన్లో సీఎంను కలిసిన చిరంజీవి, నాగార్జున
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీని నిర్మిస్తామని, ఇందుకోసం 1,500 నుంచి -2,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సినీ ప్రముఖులు, ఆఫీసర్ల టీమ్ బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన చెప్పారు. అన్ లాక్ ప్రారంభమైనందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చన్నారు. సినీ నటులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి-, విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ అని అన్నారు. షూటింగులతో పాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుందని, ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మించాలనే ఆలోచనతో ఉందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం 1,500 నుంచి -2,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుందని, ఇందులో మోడ్రన్ టెక్నాలజీతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుందని చెప్పారు. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
టాకీసులు ఓపెన్ చేసుకోండి
రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది జీవిస్తున్నారని సీఎం అన్నారు. కరోనా నేపథ్యలో విధించిన లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారని, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉందని చెప్పారు. కొవిడ్ గైడ్లైన్స్ పాటిస్తూ షూటింగులు ప్రారంభించుకోవాలని, థియేటర్లు కూడా ఓపెన్ చేయాలని ఆయన సూచించారు. దీంతో చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలని సీఎం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు.