
చెన్నైకు చెందిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్.. పలువురు సినీ నటీనటులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందజేయబోతోంది. ఈనెల 30న చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ వివరాల గురించి అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పాతికేళ్లుగా ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. ఈ ఏడాది హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు ప్రశాంత్ వర్మకు బాపు రమణ పురస్కారం, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్ అందించనున్నాం.
ఉత్తమ సంచలన చిత్రంగా పుష్ప 2, ఉత్తమ చిత్రంగా హనుమాన్, ఉత్తమ నటులుగా ప్రభాస్, అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఇంద్రజ, నివేదా థామస్ సహా పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు జెమినీ సురేష్, కమిటీ సభ్యులు వేణు, డా.మీనాక్షి, కేశవాచారి తదితరులు పాల్గొన్నారు.