సినిమాటికా ఎక్స్‌‌పో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ

సినిమాటికా ఎక్స్‌‌పో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ

ఇరవై ఏళ్లుగా సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా వర్క్ చేస్తున్న పి.జి. విందా  ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో ముందుంటారు. ఈ  క్రమంలోనే  ‘సినిమాటికా ఎక్స్‌‌పో’కు ఆయన  శ్రీకారం చుట్టారు. ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించిన ఈ ఎక్స్‌‌పోకు లభించిన స్పందన గురించి పి.జి. విందా మాట్లాడుతూ ‘ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాని గురించి తెలుసు కోవడానికి దేశ విదేశాలు వెళ్తుంటాను. ముఖ్యంగా విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్‌‌పో లు, ఎగ్జిబిషన్‌‌లు నిర్వహిస్తుంటారు. 

మన దేశంలో ఆ స్థాయి ఎక్స్‌‌పోలు లేకపోవడంతో కొత్త కెమెరాలు, క్రేన్‌‌లు, ఇతర ఎక్విప్‌‌మెంట్‌‌లు మనకు ఆలస్యంగా పరిచయమవుతున్నాయి. అందుకే ఈ సినిమాటికా ఎక్స్‌‌పో నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో గతేడాది నిర్వహించిన ఎక్స్‌‌పో మొదటి ఎడిషన్‌‌కి గొప్ప స్పందన వచ్చింది.  ఆ ఉత్సాహంతోనే నిర్వహించిన రెండో ఎడిషన్‌‌కి  ఏకంగా 38 వేల మంది హాజరు కావడం ఆసియాలోనే రికార్డు. దీంతో  మూడో ఎడిషన్‌‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి.

ఫిల్మ్ మేకింగ్‌‌పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌‌లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే ఈ ఎక్స్‌‌పో ద్వారా కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు యంగ్ టాలెంట్‌‌ను ఎంకరేజ్ చేసేలా సెమినార్లు నిర్వహించాం.  సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్‌‌ని పంచారు. భవిష్యత్‌‌లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.