- సర్కిల్ డీసీల నిర్లక్ష్యంతో ‘ఎస్టేట్స్’ విభాగానికి తగ్గిన ఆదాయం
- 2024లో మార్కెట్లు, కాంప్లెక్సులకు వచ్చిన రెంట్రూ.3 కోట్లే
- ఖాళీగా 354 మోడల్ మార్కెట్లు, 119 కాంప్లెక్స్‌లు, 446 మార్కెట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ సొంత ఆదాయంపై సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు(డీసీలు) దృష్టి పెట్టడం లేదు. గ్రేటర్‌పరిధిలోని ఆరు జోన్లలో బల్దియాకు రూ.85 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్, పరిరక్షణతో పాటు అద్దె వసూలు చేయాల్సిన బాధ్యత ఎస్టేట్ విభాగం ఆఫీసర్లపైనే ఉంటుంది. వీరు శ్రద్ధ తీసుకుంటున్నా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు సహకరించకపోవడంతో అనుకున్నంత ఆదాయం రావడం లేదు.
నేటికీ 20 ఏండ్ల కిందటి రేట్లే
జీహెచ్ఎంసీ కింద 635 మోడల్ మార్కెట్లు, 761 కాంప్లెక్సులు, 2,518 మార్కెట్లు ఉన్నాయి. ఇందులో127 మోడల్ మార్కెట్లు, 95 కాంప్లెక్సులు, 1,834 మార్కెట్లను టెండర్లు వేసి అప్పగించారు. మిగతా154 మోడల్ మార్కెట్లు, 95 కాంప్లెక్సులు, రెండు మార్కెట్లను జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల కోసం వినియోగిస్తున్నారు. 354 మోడల్ మార్కెట్లు, 119 కాంప్లెక్సులు, 446 మార్కెట్లు ఖాళీగా ఉన్నాయి.
టెండర్ల ద్వారా కేటాయించిన మోడల్ మార్కెట్లు, కాంప్లెక్సులు, మార్కెట్ల నుంచి 2024లో రూ.6.50 కోట్ల అద్దె రావాల్సి ఉండగా, రూ.3కోట్లు మాత్రమే వచ్చింది. బయట నెలకు రూ.20 వేలు అద్దె ఉండే షాపులకు జీహెచ్ఎంసీ కేవలం రూ.2వేలు మాత్రమే తీసుకుంటోంది. ఈ అద్దెలను 20 ఏండ్ల కింద నిర్ణయించగా ఇంకా వాటినే కొనసాగిస్తోంది. కొత్తగా రేట్లు ఫిక్స్ చేస్తే రూ.20 కోట్లు నుంచి రూ.30 కోట్లకుపైగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.
డీసీల నిర్లక్ష్యంతోనే..
డిప్యూటీ కమిషనర్ల నిర్లక్ష్యంతోనే బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. టెండర్ల ద్వారా షాపులు, మార్కెట్స్‌ను అప్పగించమని డీసీలకు ఎస్టేట్స్ విభాగం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికే మూడుసార్లు ఆదేశించినా డీసీలు పట్టించుకోకపోవడం లేదని తెలుస్తోంది. మరోసారి చెప్పి చూసి, అప్పటికీ స్పందించకపోతే డీసీలకు మోమోలుఇవ్వాలని ఎస్టేట్విభాగం ఆలోచిస్తోంది. లేదా ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న షాపులను టెండర్ల ద్వారా అద్దెకు ఇచ్చే విధంగా ఎస్టేట్స్ విభాగం ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.