- పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయొద్దన్న క్యాబ్ డ్రైవర్పై ఫ్రెండ్స్‌తో కలిసి దాడి
- దెబ్బలకు తట్టుకోలేక పరుగెత్తినా వదలని యువకులు
- బాధితుడి ఫిర్యాదుతో కేసు ఫైల్
కాజీపేట, వెలుగు: మద్యం మత్తులో ఓ పోలీస్ ఆర్ఐ కొడుకు వీరంగం సృష్టించాడు. పబ్లిక్ ప్లేస్లో మూత్రం పోయొద్దని చెప్పిన క్యాబ్ డ్రైవర్ పై స్నేహితులతో కలిసి దాడి చేశాడు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగింది. హనుమకొండ రెడ్డి కాలనీలో ఉంటున్న పిండి రాజు క్యాబ్ డ్రైవర్. రోజూ మంగళవారం 5 గంటలకు కాజీపేట చౌరస్తా పక్కన కారు నిలిపి ప్యాసింజర్ల కోసం చూస్తున్నాడు.
హనుమకొండ వైపు నుంచి బైక్ లపై వచ్చిన కొందరు యువకులు చౌరస్తాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మూత్ర విసర్జన చేస్తున్నారు. గమనించిన రాజు.. పబ్లిక్ తిరిగే ప్లేస్ లో మూత్రం పోయొద్దని, పక్కనే ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. దీంతో సదరు గ్యాంగ్ లోని హర్షిత్(సిద్దిపేటలో పోలీస్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ కొడుకు) రాజును తిట్టాడు. దీంతో అనవసరంగా తిట్టొద్దంటూ రాజు బదులిచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
భయంతో పరుగులు పెట్టినా వదల్లే..
మాటామాట పెరగడంతో హర్షిత్ క్యాబ్ డ్రైవర్ రాజుపై దాడికి దిగాడు. ‘కారు డ్రైవర్‌వి. పోలీస్ ఆఫీసర్ కొడుక్కే నీతులు చెప్తున్నావా’ అంటూ రాజుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న హర్షిత్ స్నేహితులు కూడా దాడికి దిగడంతో దెబ్బలకు తాళలేక రాజు సమీపంలో ఉన్న హైదరాబాద్ బస్టాప్ వద్దకు పరుగులు పెట్టాడు. అయినా హర్షిత్ అతని స్నేహితులు వెంబడించి కొట్టారు. హర్షిత్ చేతికి ఉన్న స్టీల్ కడియంతో రాజు తలపై కొట్టగా, తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది.
పక్కనే ఉన్న రెండు కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దాడిలో హర్షిత్‌తో పాటు ఆరుగురు యువకులు, ఓ మహిళ పాల్గొన్నారు. దాడి జరుగుతున్న టైంలో అక్కడకు వచ్చిన మిగతా క్యాబ్ డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చి యువకుల దాడి నుంచి రాజును కాపాడారు. పోలీసులు రావడాన్ని గమనించిన కొందరు యువకులు అక్కడి నుంచి పారిపోగా పోలీసులు హర్షిత్, జార్జ్ లను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి గురించి విచారిస్తున్నట్లు ఎస్సై శివకృష్ణ వివరించారు. కాగా, హర్షిత్‌ను స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత తాను సీఐ కొడుకునంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుళ్లపై మర్లవడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. బాధితుడు రాజు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బీఎన్ఎస్ 292, 118(1), 324(4), 351(2) రెడ్ విత్ 190 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.