హైదరాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో రోజురోజుకు జనాభా, ఇండ్లు పెరిగిపోతున్నా జీహెచ్ఎంసీ సర్కిళ్లను మాత్రం పెంచట్లేదు. మొదట్లో 7 సర్కిళ్లు ఉండగా తర్వాత వాటిని18కి పెంచారు. అనంతరం జనాభా పెరగడం, సేవలు స్లో అవడంతో మరో ఆరు సర్కిళ్లు పెంచారు. దాంతో బల్దియా సర్కిళ్లు 24కి చేరాయి. ఏడేండ్ల కింద మరో 6 పెంచి మొత్తం 30 సర్కిళ్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షలకుపైగా ఇండ్లు, కోటిన్నర జనాభా ఉంది. ఇంత మందికి సేవలు అందిచేందుకు ఉన్న 30 సర్కిళ్లు సరిపోవట్లేదు. కొన్నిచోట్ల సర్కిల్ ఆఫీసులు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థతి నెలకొంది. బల్దియా సేవలు వేగంగా అందాలంటే ఉన్న సర్కిల్ఆఫీసులను డబుల్చేయాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని నిపుణులు అంటున్నారు.
ఒకేచోట 2-4 ఆఫీసులు
ఏదైనా పనుల కోసం కొన్ని సర్కిల్ఆఫీసులకు వెళ్లాలంటే 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. గతంలో ఒకేచోట నాలుగైదు ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఏ ఏరియాకు ఆ ఏరియాలో పెట్టినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి సర్కిళ్ల ఆఫీసులు నడుస్తున్నాయి. ఈ ఏరియాల్లోని జనం ఏం పనులు కావాలన్నా ఖైరతాబాద్రాక తప్పడం లేదు. అదే విధంగా సరూర్ నగర్ లో సరూర్ నగర్, హయత్నగర్, ఎల్బీనగర్ ఆఫీసులు ఉన్నాయి. చార్మినార్, సికింద్రాబాద్, కూకట్ పల్లి జోనల్ ఆఫీసుల్లోనూ రెండు చొప్పున నడుస్తున్నాయి.
ఏ పనికైనా ఆడికే..
ఇంటి నిర్మాణ అనుమతులు, బర్త్, డెత్, ట్రేడ్ లైసెన్సులు, ఓటర్ ఐడీ తదితర పనులు, స్థానిక సమస్యలను తెలిపేందుకు సర్కిల్ ఆఫీసులకు వెళ్లక తప్పడం లేదు. అన్ని ఆన్లైన్లోనే చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ టెక్నికల్ సమస్యలతో సర్టిఫికెట్లు సకాలంలో అందట్లేదు. ఇవే కాకుండా రోడ్లు, నాలాలు, చెత్త తదితర సమస్యలు ఏవైనా సర్కిల్ స్థాయి ఆఫీసర్లకు చెబితేనే పనులు జరుగుతున్నాయి. ఇలా ఏ పనైనా సర్కిల్ ఆఫీసులతోనే ముడిపడి ఉండడంతో సర్కిళ్లు కీలకమయ్యాయి. వీటి సంఖ్య పెంచడంతో పాటు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
సర్కిళ్లతోపాటు సిబ్బందిని పెంచాలె
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్కిల్ఆఫీసులను పెంచితే మంచిదే. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలె. పదేండ్ల కింద నేను బల్దియాలో పని చేసినప్పుడు 18 సర్కిళ్లు ఉండేవి. తర్వాత మరో 12 పెంచారు. కానీ సిటీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రజలకు త్వరగా సేవలు అందాలంటే సర్కిల్ ఆఫీసులు ఇంకా పెంచొచ్చు.
- సాయికుమార్, బల్దియా రిటైర్డ్ అడిషనల్ కమిషనర్
30 సర్కిళ్లను 60 చేయాలె
ప్రస్తుతం గ్రేటర్లోని ఇండ్లు, జనాభాకి సరిపడా సేవలు అందాలంటే ఉన్న 30 సర్కిళ్లను 60 చేయాలె. ప్రస్తుతం ఒక్కో సర్కిల్ ఆఫీసు పరిధిలో లక్ష ఇండ్లు ఉన్నాయి. 50 వేల ఇండ్లకు ఒక సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేస్తే వేగంగా సేవలు అందే అవకాశం ఉంది. అన్ని సేవలు ఆన్ లైన్ అయితే ఇప్పుడున్నవి సరిపోయేవి. కానీ ఏ పని కావాలన్నా సర్కిల్ఆఫీసులకు వెళ్లక తప్పట్లేదు. అందుకే సర్కిల్ ఆఫీసులను పెంచడంతో పాటు అందరికీ దగ్గరగా ఉండేలా చూడాలె. అప్పుడే వృద్ధులు కూడా ఆఫీసులకు వెళ్లేందుకు వీలుంటుంది.
- ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, జేఎన్టీయూ