నేటి నుంచి దశలవారీగా ఎత్తివేత
తప్పనున్న రూ.200 కోట్ల అదనపు భారం
మందమర్రి, వెలుగు: సింగరేణి ఆస్తుల రక్షణ కోసం పనిచేస్తున్న సెంట్రల్ఇండస్ట్రియల్సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సేవలు నిలిచిపోనున్నాయి. బెల్లంపల్లి రీజియన్ లోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లోని బొగ్గు గనుల్లో సెక్యూరిటీ డ్యూటీలు చేసే సీఐఎస్ఎఫ్ బలగాలను సోమవారం నుంచి దశలవారీగా తొలగించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలాఖరునాటికి వీరి సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో సింగరేణి సంస్థకు ఏటా రూ. 200 కోట్లు అదనపు ఆర్థిక భారం తగ్గనుంది. సింగరేణిలో 28 సంవత్సరాల కిందట సీఐఎస్ఎఫ్సేవలు మొదలయ్యాయి. ప్రస్తుతం కొత్తగూడెం, రామగుండం రీజియన్ పరిధిలో దాదాపుగా సీఐఎస్ఎఫ్ బలగాల సేవలు కనుమరుగయ్యాయి. బెల్లంపల్లి రీజియన్‌లో మాత్రమే సేవలు కొనసాగుతున్నాయి. సింగరేణిలో 1986 ప్రాంతంలో విచ్చలవిడిగా వెలిసిన క్రాఫ్ట్ సంఘాలకు తోడు పీపుల్స్‌వార్ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యకలాపాల వల్ల బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలో నిత్యం సమ్మెలు జరిగేవి. కార్మికులకు ఏర్పడిన ప్రతి చిన్న సమస్య కోసం వివిధ సంఘాలు ఆకస్మిక సమ్మెలు, సుదీర్ఘ సమ్మెలు చేయించేవి. దీంతో సింగరేణి కంపెనీలో ఒకదశలో పారిశ్రామిక శాంతి దెబ్బతింది. దీనికి తోడు క్రమశిక్షణ లోపించి కంపెనీకి చెందిన ఆస్తులను, విలువైన సామగ్రిని కొందరు పథకం ప్రకారం విచ్చలవిడిగా ఎత్తుకెళుతున్నా ఆఫీసర్లు చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 1992 అక్టోబర్‌లో బెల్లంపల్లి రీజియన్‌లోని మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో పూర్తిస్థాయిలో, రామగుండం రీజియన్‌లోని కొన్ని కీలకమైన బొగ్గు గనులు, విలువైన మిషన్లు, పరికరాలు ఉండే స్టోర్ట్స్, వర్క్‌షాప్‌లు, జీఎం ఆఫీసులు, మ్యాగ్జిన్లు(మందుగుండు సామగ్రి ఉండే కేంద్రం)లో పాక్షికంగా సీఐఎస్ఎఫ్ బలగాలను నియమించారు.
తగ్గనున్న అదనపు భారం
సీఐఎస్ఎఫ్ బలగాలను నియమించుకున్న సింగరేణి వారి జీత భత్యాలు చెల్లిస్తూ.. ఆఫీసుల నిర్వహణ, వసతి కోసం క్వార్టర్లు, విద్య, వైద్యం తదితర సౌకర్యాలు, డ్యూటీ చేయడానికి వెహికల్స్కోసం ఏటా రూ.200 కోట్లు ఖర్చుచేస్తోంది. వారికి ఏ అవసరమున్నా, ఎంత ఖర్చయినా సింగరేణి ఆగమేఘాల మీద అన్నీ మంజూరు చేస్తోంది. ఇన్ని చేసినా సీఐఎస్ఎఫ్ జవాన్లలో లోపించిన క్రమశిక్షణ, తొందరపాటు నిర్ణయాల వల్ల వివిధ గనులపై కార్మికులతో గతంలో ఘర్షణలు జరిగిన దాఖలాలున్నాయి. దీంతో వారు ఆయుధాలు ధరించి డ్యూటీ చేయకూడదన్న ఆదేశాలతో లాఠీలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు వివిధ బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లలో కాపలాగా ఉన్న నేపథ్యంలో పీపుల్స్‌వార్‌నక్సలైట్లు వారిపై దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటనలు జరిగాయి. ఫలితంగా సింగరేణిలో ఆస్తుల రక్షణ నామమాత్రమైంది. చాలా సందర్భాల్లో సింగరేణి ఆస్తులను ఎత్తుకెళ్లే స్మగర్లు, దొంగలకు వీరి అండదండలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. బెల్లంపల్లి రీజియన్‌లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో సుమారు 400 మందికిపైగా పనిచేస్తున్నట్లు తెలుస్తొంది.
మ్యాగ్జిన్ ప్రాంతంలో కొనసాగింపు
రీజియన్‌లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెలంపల్లి ఏరియాల్లో బొగ్గు గనులు, స్టోర్స్, వర్క్‌షాప్స్, 132 పవర్సబ్స్టేషన్, జీఎం ఆఫీస్, బంగ్లా ఏరియా, చెక్‌పోస్టులు, వేబ్రిడ్జిల్లో సీఐఎస్ఎఫ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇక్కడ నుంచి బలగాలను జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలించనున్నట్లు సమాచారం. మరోవైపు కీలకమైన మ్యాగ్జిన్ప్రాంతంలో మాత్రం సీఐఎస్ఎఫ్ సేవలు కొనసాగుతాయి.