- భేటీ అయిన ఆయిల్ కంపెనీల చీఫ్‌లు
- సప్లైలను తగ్గించే అవకాశం
న్యూఢిల్లీ: బ్రెంట్ క్రూడాయిల్ పీపా ధర వచ్చే ఏడాది నాటికి 70 డాలర్లకు (దాదాపు రూ.5,821) దిగొచ్చే అవకాశం ఉందని సిటీ బ్యాంక్ అంచనా వేసింది. అయితే ప్రస్తుతం దీని ధర 100 డాలర్ల దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ధరలపై చర్చించడానికి సంబంధిత దేశాల మంత్రులు, ఆయిల్ఇండస్ట్రీ చీఫ్‌లు సోమవారం జరిగిన ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో కలుసుకున్నారు.
ధరల పోకడలు, సప్లైలు తగ్గించడం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు నెలల తరువాత సీఓపీ28 కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అబూదబీలో ఈ మీటింగ్ జరుగుతోంది. షెల్ పీఎల్సీ, టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ, ఓక్సిడెంటల్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీల సీఈఓలు ఈ సందర్భంగా ఎనర్జీ ట్రాన్సిషన్‌పై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యూఏఈ ఎనర్జీ మినిస్టర్ సుహైల్ అల్ మాజ్రీ, ఒపెన్ సెక్రెటరీ జనరల్ హైతమ్ అల్ ఘెయిస్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. చమురు నిల్వలు పెరుగుతున్నాయి కాబట్టే వచ్చే ఏడాది నాటికి బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని సిటీ గ్రూప్ రిపోర్ట్ ప్రకటించింది. అవసరాలకు మించి క్రూడ్ మార్కెట్‌కు వస్తోందని పేర్కొన్నది.
అయితే ధరల పెరుగుదలకు చాలా అవకాశాలు ఉన్నాయని, తగ్గే పరిస్థితులు లేవని హలిబర్టర్ కంపెనీ సీఈఓ జెఫ్ మిల్లర్ చెప్పారు. ఒపెక్ దేశాలు మరీ ఎక్కువగా సప్లైలను తగ్గించే అవకాశం లేదని ఎని స్పా అనే కంపెనీ సీఈఓ క్లాడియో డెస్కాల్జీ అన్నారు. ఈ నెల లండన్‌లో క్రూడ్ ధరలు 10 శాతం పెరిగాయని చెప్పారు. డిమాండ్ పటిష్టంగా ఉందని, ఆయిల్ ఇండస్ట్రీకి తగినన్ని ఇన్వెస్ట్మెంట్లు రాకపోవడమే అసలు సమస్యని చెప్పారు.
ఇండియన్ కంపెనీలకు ఇబ్బందులు
ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండగా, దేశంలో మాత్రం వీటిని మార్చడం లేదు. ఫలితంగా ఐఓసీ, హెచ్‌పీసీల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరు డీజిల్‌కు రూ.ఐదు చొప్పున నష్టపోతున్నాయి. లీటరు పెట్రోల్‌పై మాత్రం రూపాయి చొప్పున లాభం సంపాదిస్తున్నాయి. అయితే ఏప్రిల్–జూన్ క్వార్టర్లో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఇవి ప్రస్తుత రేట్లకే పెట్రో ప్రొడక్టులను అమ్మి విపరీతంగా లాభాలను గడించాయి.
అప్పుడు లీటరు డీజిల్‌పై రూ.ఎనిమిది చొప్పున, పెట్రోల్‌పై రూ.తొమ్మిది చొప్పున మార్జిన్లను సంపాదించాయి. ఈ లెక్కన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నష్టాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధరలు పెరగడంతో మన కంపెనీలకు నష్టాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం పీపా ధర 90 డాలర్లపైన (దాదాపు రూ.7,484) పలుకుతోంది. సాధారణంగా అయితే ఇండియన్ ఆయిల్ రిఫైనరీలు అంతర్జాతీయ మార్కెట్లో ధరలను బట్టి స్థానిక ధరలను రోజుకు ఒకసారి మార్చేవి. ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేయడం లేదు.