యాక్సిస్ బ్యాంక్.. సిటీ బ్యాంక్ కన్జూమర్ బిజినెస్‌లను విలీనం చేసుకుంది. ఈ డీల్ విలువ రూ.11,603 కోట్లు. సీసీఐ అనుమతులు పొందిన కేవలం ఏడు నెలల్లో విలీనం పనులను పూర్తి చేశామని ప్రకటించింది. ఈ లావాదేవీలో భాగంగా సిటీ బ్యాంక్ తన లోన్లు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్, రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌లను యాక్సిస్‌కు అప్పగించింది. ఈ విలీనంలో భాగంగా సిటీ బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సిటీ కార్ప్ ఫైనాన్స్ (ఇండియా) లిమిటెడ్‌ను కూడా విక్రయించారు. భారీగా ప్రీమియం కార్డులు ఉన్న క్రెడిట్ కార్డ్ ఫ్రాంచైజీ ఈ డీల్ వల్ల యాక్సిస్ బ్యాంక్సొంతమైంది. అంతేకాకుండా కార్డుల వ్యాపారంలో మార్కెట్ వాటా 11.4 శాతం నుంచి 16.2 శాతానికి పెరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్ కస్టమర్ల సంఖ్య 19 శాతం పెరగడంతో మొత్తం కార్డుల సంఖ్య 18 లక్షలకు చేరుకుంది.
డిపాజిట్లు రూ. 8,88,100 కోట్లకు చేరడంతో పాటుగా, కాసా డిపాజిట్ల వాటా 77 శాతానికి పెరిగింది. ఈ విషయమై యాక్సిస్ బ్యాంక్ ఎండీ–సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ దాదాపు 24 లక్షల మంది కస్టమర్లకు, 3200 మంది ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంక్ కుటుంబంలోకి వెల్కమ్ చెబుతున్నామని అన్నారు. ఇక నుంచి కూడా సిటీ కస్టమర్ల ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్ కార్డుల నంబర్లు మారవు. మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్, ఏఐఎఫ్‌లు యాక్సిస్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సిటీ గోల్డ్ గ్లోబల్ బ్యాంకింగ్ సదుపాయాలు నిలిచిపోయతాయి. సిటీ క్రెడిట్ కార్డుల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులూ ఉండవని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.