సిటీ బ్యాంక్ బిగ్ మిస్టేక్: జర్రుంటే రూ.6,723 లక్షల కోట్లు ఖతం అయ్యేవి

సిటీ బ్యాంక్ బిగ్ మిస్టేక్: జర్రుంటే రూ.6,723 లక్షల కోట్లు ఖతం అయ్యేవి

ఇద్దరు ఉద్యోగులు చేసిన చిన్న పొరపాటు వల్ల బ్యాంక్ మొత్తం ఖాళీ అయ్యేది. కోటి కాదు రెండు కోట్లు ఏకంగా ఏకంగా రూ.6,723 లక్షల కోట్లు ఓ వ్యక్తి ఖాతాలోకి ట్రాన్స్‎ఫర్ అయ్యేవి. అదే బ్యాంక్‎కు చెందిన మరో ఉద్యోగి ఈ పొరపాటు గుర్తించడంతో రూ.6,723 లక్షల కోట్ల నగదు బదిలీ చివరి నిమిషంలో ఆగిపోయింది. ఈ ఘటన అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీగ్రూప్‎లో జరిగింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ప్రముఖ సిటీ బ్యాంక్‌ ఉద్యోగులు 2025, ఏప్రిల్‌ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేశారు.

భారతీయ కరెన్సీ ప్రకారం ఆ డబ్బు విలువ రూ.6,723 లక్షల కోట్లు. ఇద్దరు ఉద్యోగులు ఈ పొరపాటును గుర్తించలేదు. దాదాపు 90 నిమిషాల తర్వాత మరో ఉద్యోగి ఈ తప్పును గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు.. ఆ ట్రాన్స్‎క్షన్ నిలిపివేశారు. ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్‌ తమ వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా వేరే వ్యక్తి ఖాతాలోకి ఇంకా ట్రాన్స్‎ఫర్ కాలేదని.. చివరి నిమిషంలో ఉద్యోగులు గుర్తించి నగదు బదిలీని ఆపేశారని తెలిపింది. 

ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని సిటీ బ్యాంక్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే.. సిటీ బ్యాంక్‎లో గతేడాది ఇది ఒక్కటే తప్పు జరగలేదని.. ఇలాంటి తరహా పొరపాట్లు 10 జరిగాయని రిపోర్టులో వెల్లడించింది సిటీ గ్రూప్. అవి ఇంత పెద్ద మొత్తంలో కాకుండా 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి పొరపాట్లని వెల్లడించింది. యూఎస్ బ్యాంక్ ఇండస్ట్రీలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన బదిలీల్లో పొరపాట్లు అసాధారణమని తప్పులను సమర్థించుకుంది సిటీ బ్యాంక్.