బల్దియా ఆఫీసర్లకు ఫోన్​ చేస్తే..  నో రెస్పాన్స్​

బల్దియా ఆఫీసర్లకు ఫోన్​ చేస్తే..  నో రెస్పాన్స్​
  • బల్దియా వెబ్​సైట్​లోనూ  తప్పు సమాచారం
  • కనిపించని ఉన్నతాధికారుల కాంటాక్ట్ ​నంబర్లు
  • కాల్​ లిఫ్ట్ చేయని కింది స్థాయి సిబ్బంది 
  • అధికారుల తీరుపై సిటిజన్ల ఆగ్రహం

ఆసిఫ్​నగర్​ కి చెందిన సుధాకర్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్​వేయించుకునేందుకు గురువారం బల్దియా హెల్ప్​లైన్ నంబర్ ​కాల్​చేస్తే ఎత్తలేదు. బల్దియా వెబ్​సైట్​లో చూసి సాయంత్రం 4 గంటలకు కమిషనర్  ల్యాండ్​ లైన్ నంబర్​కు  కాల్​ చేయగా లిఫ్ట్ చేయలేదు. మరికొందరి అధికారులకు చేసినా కూడా స్పందించలేదు.’’ ఖైరతాబాద్​కి చెందిన రాజు శానిటేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్​పై చెప్పేందుకు​ గురువారం బల్దియా వెబ్​సైట్​లోంచి   ఖైరతాబాద్ ​ఏఎంహెచ్ వో  నంబర్​తీసుకుని కాల్​ చేస్తే లిఫ్ట్ చేయలేదు. జోనల్ కమిషనర్ ల్యాండ్​ లైన్ నంబర్​కు  కాల్ చేస్తే ‘ చెక్ ద నంబర్​అని వచ్చింది.’’


హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​లోని ఏదైనా ప్రాబ్లమ్ పై చెబుదామన్నా.. సమాచారం తెలుసుకుందామన్నా.. ఫోన్​చేస్తే అధికారులు ఎత్తట్లేదు. బల్దియా వెబ్​సైట్ లో కూడా అప్​డేట్​సమాచారం సరిగా  ఉండదు. సిటిజన్లు ఫోన్​ చేస్తుండగా కొందరు అధికారుల నంబర్లకు కలిసినా లిఫ్ట్ చేయరు. దీనిపై ఉన్నతాధికారులకు చెబుతామంటే వాళ్ల నంబర్లు కూడా వెబ్ సైట్​లో అందుబాటులో లేవు. కిందిస్థాయి అధికారులకు ల్యాండ్ లైన్ నంబర్లకు కాల్ చేస్తే రెస్పాన్స్ కావడంలేదని పలువురు పేర్కొంటున్నారు. సిటీలో ముఖ్యమైన శానిటేషన్​అండ్​హెల్త్ అడిషనల్​కమిషనర్ ఫోన్ నంబర్​సైతం వెబ్​సైట్​లో కనిపించదు. కొత్తగా వచ్చిన అడిషనల్​కమిషనర్ల పేర్లు కూడా అప్​డేట్​చేయలేదు. ఇలా చాలామంది ఆఫీసర్ల ఫోన్​నంబర్లు లేకపోవడంపై సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ట్రాన్స్​ఫర్ అయిన కూడా వారి పేర్లు ఉంటుండగా, తమకు సంబంధించిన ఆఫీసర్ ఎవరున్నారో కూడా తెలుసుకోని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏ చిన్న పని ఉన్నా కూడా బల్దియా హెడ్దాఫీస్​దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదే ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్​కు క్షణాల్లో రెస్పాండ్​అయ్యే అధికారులు జనానికి మాత్రం ఎంతకూ రెస్పాన్స్​ ఇవ్వడంలేదు. 
 

అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ వాడుతున్నామంటూ..
టెక్నాలజీని వాడకంలో బల్దియా ఎంతో ముందుందని, అడ్వాన్స్​డ్​గా ఉంటున్నామని అధికారులు చెబుతుండగా,  సంస్థ సొంత వెబ్ సైట్​నిర్వహణను మాత్రం పట్టించుకోవడంలేదు. వెబ్ సైట్​లో ఏ సమాచారం సక్రమంగా ఉండడంలేదు. అధికారుల నుంచి కరోనా కేసుల వివరాల వరకు ఏది కూడా సరిగా లేదు.  సపరేట్​గా ఐటీ వింగ్ ఉన్నప్పటికీ  వెబ్​సైట్​ నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  
 

కొన్నేళ్లుగా టెలిఫోన్ ​డైరీ అందుబాటులో ఉండట్లే..
బల్దియా కమిషనర్ నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఫోన్ల బిల్లులు సంస్థనే చెల్లిస్తుంది.  జనం డబ్బును నుంచి బిల్లులు కడుతుండగా, ఏదైనా  సమస్యపై అధికారికి కాల్​చేస్తే నంబర్లు కలవడంలేదు. కొందరివి కలిసినా అసలే ఎత్తడంలేదు. గతంలో అధికారుల నంబర్లను​ఎప్పటికప్పుడు వెబ్ సైట్​లో అప్​డేట్ ​చేసేవారు.  ప్రస్తుతం ఉన్నతాధికారుల నంబర్లు ఎవరివి లేవు. కిందిస్థాయి సిబ్బంది నంబర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ మెజారిటీ స్థాయి అధికారులు ఫోన్​ చేస్తే రెస్పాండ్ ​కావడంలేదు. గతంలో బల్దియా అధికారుల టెలిఫోన్ ​డైరీ కూడా ఉండగా కొన్నేళ్లుగా దాన్ని పూర్తిగా మరిచిపోయారు.