- సిటీలో డల్‌గా సాగిన పోలింగ్
- లోక్ సభ లోనూ అంతంతే ఇంట్రెస్ట్
- అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీ తేడా
- రూరల్ సెగ్మెంట్లలో కొంచెం బెటర్
- ఓవరాల్‌గా తగ్గిన పోలింగ్ పర్సంటేజ్
హైదరాబాద్, వెలుగు : ఎప్పటిలెక్కనే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటిజన్లు అంతగా ఆసక్తి చూపలేదు. పోలింగ్‌సరళిని పరిశీలిస్తే ఇదే స్పష్టమైంది. గ్రేటర్సిటీలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనగా.. లోక్ సభ పోలింగ్ కు వచ్చేసరికి ఇంట్రెస్ట్ పెట్టలేదు. రూరల్సెగ్మెంట్లలో కొంత బెటర్ అనిపించింది. అర్బన్ సెగ్మెంట్లలోనే డల్‌గా సాగింది. గత రెండు రోజులు ఎండలు ఉన్నప్పటికీ సోమవారం ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. దీంతో జనం పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వస్తారని ఎన్నికల అధికారులు ఆశించారు.
అయినా.. ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు . హైదరాబాద్ సెగ్మెంట్ లో సాయంత్రం 5 గంటల వరకు 39.17 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్టర్నవుట్ డల్‌గా కనిపించింది. బీజేపీ ఇక్కడ గట్టి పోటీనిస్తుందని, ఓటింగ్ శాతం పెరుగుతుందని వేసిన విశ్లేషకుల అంచనాలు తలకిందులు అయ్యాయి. పోలింగ్34– 38 శాతం వరకు మాత్రమే ఉంది. కార్వాన్, గోషామహల్, యాకుత్‌పురాల్లో 40 శాతం దాటినా.. గత ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే చాలా తక్కువ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలో కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్‌నమోదైంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 50.55 శాతం పోలింగ్‌నమోదు కాగా, ఈసారి 42.74 గా ఉంది. గత లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కన్నా ఇది కొద్దిగా ఎక్కువ. అప్పట్లో 41.89 శాతం నమోదైంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మైనార్టీ ఓటర్లు ఎక్కువ. వీళ్లంతా ఈసారి ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. దేశంలోనే అతి పెద్ద లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్‌గిరిలో 47.57 శాతం నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 53.90గా ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 49.40 శాతం నమోదైంది. మల్కాజ్గిరి, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు.
వీరంతా తమ సొంత రాష్ట్రంలో ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దీంతో సెగ్మెంట్లలో ఓటింగ్‌శాతం గణనీయంగా తగ్గింది. హోరాహోరీగా సాగిన చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ రూరల్ఏరియాల్లో పోలింగ్బాగానే అయినట్లు కనిపించినా, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తక్కువే. అప్పడు 76.57 శాతం కాగా, ఇప్పుడు 60.07 శాతంగా పరిమితమైంది. ఇక్కడ కూడా ఏపీ ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో, నార్త్ఇండియా, ఐటీ ఓటర్లు భారీగానే ఉంటారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో 53.18 ఓటింగ్ శాతంతో పోలిస్తే ఈసారి బాగానే పెరిగినట్లు చెప్పొచ్చు. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 73.60, 75.75, 76.53, 74.18 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు మాత్రం 66.34, 69.44, 65.98, 70.84 శాతం నమోదైంది. చేవెళ్ల పరిధిలోకి వచ్చే మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా స్వల్పమైన తేడా కనిపించింది.