‘ప్రజల విశ్వాసం పొందని పాలకుడెంత ప్రజా కంఠకుడో, నిరంతరం పౌరులను రాజే అనుమానించే సమాజం కూడా అంతే అశాంతిమయం’ అంటాడు చాణక్యుడు. పరస్పర నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడ్డ పాలనలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది! పాలకులు–పాలితులకు మధ్య విశ్వాసం మన రాష్ట్రంలో, దేశంలో క్రమంగా కొరవడుతోంది. శాస్త్ర–సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో సమస్యలు కొత్త రూపంలో పుట్టుకొస్తున్నాయి. వాటిని పరిష్కరించే సహజ నైపుణ్యపు దారులేమో మూసుకుపోతున్నాయి. కొత్త మార్గాలు ఏర్పడటం లేదు! పదేళ్ల కింద ప్రతిపాదన వచ్చి, అయిదేళ్లుగా కసరత్తు జరుగుతున్న కీలకాంశంలో వెంటనే రావాల్సిన ఓ చట్టం ఏర్పాటే కనాకష్టమౌతోంది.
బిల్లుపై కసరత్తు తుది దశకు వచ్చి, దురదృష్టవశాత్తు మళ్లీ వాయిదా పడింది. భూమిమీద అతి విశాల, ప్రగతిశీల ప్రజాస్వామ్యమని చెప్పుకునే భారత్ లో పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఏ రక్షణా లేదు. ‘వ్యక్తిగత వివరాల(భద్రత) చట్టం’(పర్సనల్ డాటా ప్రొటక్షన్ లా) రూపొందకుండానే బిల్లు అటకెక్కింది. ‘వ్యక్తిగత గోప్యత’ సందేహాలకు అతీతంగా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పి అయిదేళ్లవుతున్నా సదరు హక్కు రక్షణకు అతీ గతీ లేదు. మరింత మెరుగైన బిల్లు తీసుకురావడానికే, ఈ బిల్లును ఉపసంహరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా పౌరసమాజంలో సందేహాలున్నాయి. ఇంటర్నెట్ ఇంటింటికీ విస్తరించి, సామాజిక మాధ్యమ వేదికలు సగటు జీవితాల్ని నడిపిస్తున్న ఆధునిక వ్యవస్థలో పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగితే, ఇయ్యాల ఈ దేశంలో రక్షణ లేదు. చర్య తీసుకునే వ్యవస్థ అసలే లేదు. ఈ లోపం వల్ల ఎన్నో అనర్థాలున్నాయి. సమస్య తీవ్రత ఎవరికీ ఆనటం లేదు!
ప్రైవసీపై ముప్పేట దాడి
హైదరాబాద్‌లో ఐ–ట్రిపుల్ సీ(ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్) ప్రారంభమవడం, క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) చట్టానికి చేసిన(తాజా–2022) సవరణలు దేశ వ్యాప్తంగా అమల్లోకి రావటం, పార్లమెంట్లో లోగడ ప్రతిపాదించిన ‘డాటా ప్రొటక్షన్ బిల్లు’ను కేంద్రం వెనక్కి తీసుకోవడం..ఈ మూడు పరిణామాలూ ఒకే రోజున జరగడం యాదృచ్చికమే కావచ్చు! కానీ, మూడింటి మధ్య ఉన్న కార్యకారణ సంబంధం తెలిస్తే, పౌరుల వ్యక్తిగత గోప్యత ఎంత ప్రమాదంలోకి జారిపోతోందో కళ్లకు కడుతుంది. దాని రక్షణ ఎలా గాల్లో దీపమైందో ఇట్టే తెలిసిపోతుంది.
గిట్టని వాళ్లను దెబ్బకొట్టొచ్చు
నేరాల నియంత్రణకు, ఒక సానుకూల భూమిక పోలీసులు సిద్ధం చేసుకోవాలి. తరచూ నేరాలు చేసే వారిని గుర్తించి, వారిపై నిఘా వేయాలి. వారికి సంబంధించిన వివరాలు సేకరించి, భద్రపరచి, క్రమ నిర్వహణ ద్వారా తదుపరి నేరాల్లో వారి పాత్ర–ప్రమేయాలు పరిశీలిస్తూ నేరాల్ని నియంత్రించాలి. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని గత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ‘క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) యాక్ట్–2022’ సవరణ చట్టం తెచ్చింది. దీని ప్రకారం, ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుడో, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీకో సంబంధించిన సమాచారం, వివరాలను దర్యాప్తు అధికారి, వారి నుంచి యథేచ్ఛగా సేకరించవచ్చు. అలా సేకరించే డాటా ఐరిష్, స్కాన్ రిపోర్టు, బయెమెట్రిక్ వంటి దేదైనా కావచ్చు. వాటిని 75 ఏండ్ల వరకు భద్రపరచుకోవచ్చు. ఇది ఎంతో అభ్యంతరకరమని విపక్షాలు, మేధావివర్గం విమర్శ. గిట్టనివారిపై అభియోగాలు మోపి, ఎఫ్ఐఆర్ కట్టవచ్చు.
వ్యక్తిగత గోప్యతా హక్కును కాలరాస్తూ, వారికి సంబంధించిన కీలక వివరాలు–సమాచారం సేకరించొచ్చు. సుదీర్ఘకాలం భద్రపరచేటప్పడు, దాని దుర్వినియోగానికి ఉన్న ఆస్కారాన్ని పరిగణనలోకి తీసుకోవాలనేది వారి వాదన. అందుకు అవసరమైన డాటా రక్షణ చట్టమే లేకుండా, సీఆర్పీసీ చట్ట సవరణ ప్రమాదకరమంటున్నారు. రాజకీయంగా దుర్వినియోగానికి ఎంతో ఆస్కారముంది. దేశ భద్రత పేరిట వందల కోట్ల రూపాయలు వెచ్చించి, గిట్టని వారి వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛకు వ్యతిరేకంగా ‘పెగసస్’ వంటి ఇజ్రాయిలీ నిఘా కన్ను కొని–వినియోగించడం దేశంలో వివాదాస్పదమైంది. తన పౌరులకు వ్యతిరేకంగా సర్కారే ఇలాంటి వ్యవహారాలకు తలపడ్డపుడు, అంతర్జాతీయ కార్పొరేట్లు, సామాజిక మాధ్యమ సంస్థల నుంచి వ్యక్తిగత గోప్యతకు రక్షణేది? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పకడ్బందీ చట్టంతోనే రక్షణ
మన వ్యక్తిగత వివరాలకు రక్షణ లేకుంటే, వాటిని ఎవరైనా, ఎక్కడైనా, దేనికైనా వాడుకునే ప్రమాదముంది. పాస్వర్డ్ నుంచి ఆర్థిక గణాంకాల దాకా, అధికారిక గుర్తింపు నుంచి ఆరోగ్య సంగతులు దాకా, బయోమెట్రిక్ నుంచి జెనెటిక్ డాటా దాకా ఇది మనకు తెలియకుండానే ఇతరుల చేతుల్లో పడితే ఎన్ని అనర్ధాలో! దేశవిదేశాలకు చెందిన వ్యాపార–వాణిజ్య సంస్థలు ఏ రూపంలో అయినా వాడి, మన వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే ఆస్కారం ఉంటుంది. అది నేరస్తులకు చేరితే మరింత ప్రమాదం.
పరిపాలనా క్రమంలో పౌరులకు సంబంధించిన వివరాలు, సమాచారం నిర్దిష్టంగా అవసరమయ్యే చోట, ఆ మేరకు సేకరించడం, పొందుపరచడం మామూలే! కొన్నిసార్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిధిలో ఈ సమాచారాన్ని, వివరాల్ని నిర్వహిస్తుంటారు. ఈ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా జరగాలి. స్పష్టంగా వెల్లడించిన అవసరానికి తప్ప, ఇతరత్రా వాడకూడదు. సంబంధం లేని వేరెవరి చేతుల్లోనూ పడకుండా కట్టుదిట్టం చేయాలి. లేకుంటే అది ఇతరుల అధీనంలోకి వెళ్లొచ్చు.
ఆధార్ కోసమో, మరో అవసరానికో సమీకరించిన పౌరుల వివరాలు, వాణిజ్య సంస్థలకు అమ్ముకున్న వైనాలు, ఆ క్రమంలో నడిబజార్లో కుప్పలుగా పత్రాలు దొరికిన ఘటనలు కోకొల్లలు. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కేనని, రాజ్యాంగ భద్రత ఉండాలని పుట్టుస్వామి కేసు(2017)లో సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్ విస్పష్టంగా చెప్పింది. దీన్ని అమలు చేయడానికి అవసరమైన చట్టాన్ని రూపొందించడంలో మన వ్యవస్థలు, పార్లమెంటు ఆపసోపాలు పడుతున్నాయి.
పదేండ్ల కింద జస్టిస్ షా కమిటీ, అయిదేళ్ల కింద శ్రీకృష్ణ కమిటీ నివేదికలిస్తూ పకడ్బందీ చట్టం ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. నిర్దిష్ట సిఫారసులు చేశాయి. ఫలితంగా2019 లో సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును సర్కారు ఇప్పుడు వెనక్కి తీసుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ) నుంచి పలు సవరణ ప్రతిపాదనలు వచ్చిన దృష్ట్యా, సమూలంగా మార్చి కొత్త బిల్లును త్వరలోనే సభ ముందుకు తెస్తామని కేంద్ర ఎలక్టానిక్ –ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభకు తెలిపారు. ఆరోపణ–ప్రత్యారోపణలెలా ఉన్నా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించే సమగ్ర చట్టం తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత.
నువ్వు..నేనూ నిఘా నీడలో?
ఒక వైపు, ఇంటర్నెట్ ఆధారితమై అసంఖ్యాకంగా జరుగుతున్న సైబర్‌నేరాలు పోలీసు రికార్డుల్లోకెక్కుతున్నాయి. మరో వైపు కృత్రిమ మేధా–క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ సహకారంతో హైదరాబాద్‌లో గురువారమే ప్రారంభించిన ‘ఐ–ట్రిపుల్సీ’ వంటి వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. దాని ఆధునికత, పనితీరు, విస్తృతి, సామర్థ్యం వింటే ఒళ్లు జలదరించే గగుర్పాటు ఖాయం! మొత్తం తెలంగాణ రాష్ట్రం, పది లక్షల సీసీ కెమెరాల నిరంతర నిఘా నీడలోకి జారిపోతుంది.
నేరాల నియంత్రణలో, పోలీసింగ్‌లో, వివిధ విభాగాల మధ్య సమన్వయ సాధనలో ఎంతో ఉపయోగపడే వ్యవస్థ ఇది. అభినందించి, ఆహ్వానించదగిందే! సందేహం లేదు. కానీ, సమానస్థాయిలో దురుపయోగానికీ ఆస్కారం ఉంది. పాలకులే చెప్పినట్టు, రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఐ–త్రిబుల్ సీకి ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రో, మంత్రులో, ఇతర ముఖ్యులో జిల్లా పర్యటనకు వెళుతుంటే ముందు జాగ్రత్తగా నిరసన కారులపైన, పౌర సంఘాలమీద, ప్రజా సమూహాల మీద కన్నేసి, పహారా కాసి, వారిని నిర్బంధించి తమ పనులు సాఫీగా చేసుకుంటున్న విపరీత కాలమిది!
నియమాలకు, నిబంధనలకు నీళ్లొదిలి అన్ని వ్యవస్థల్ని ఏలినవారు అడ్డంగా ‘వాడుకుంటున్న’ పాడు కాలం. ఈ అవ్యవస్థలో, ఇంతటి ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వస్తే, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోరనే గ్యారెంటీ ఏం లేదు. ఎవరు ఎవరిని కలుస్తున్నారు? ఎంత సేపు కలిశారు? ఏం మంతనాలు జరుపుతున్నారు? తదుపరి కదలికలేంటి? అన్నీ తెలుసుకోవచ్చు! చేస్తున్నరనో, చేస్తారనో... అనట్లేదు. చేయడానికి ఆస్కారం ఉందనేదే వాదన. ముఖ్యంగా, ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తించి(ఫేసియల్ రికగ్నిషన్), నిరంతర నిఘా(ట్రాకింగ్)పెట్టే సదుపాయం ఈ వ్యవస్థలో ఉంది. ఫలానా వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎంతసేపున్నారో తెలుసుకోవచ్చు. దీన్నొక సాధనంగా వాడి, అధికార–అంగ బలాల్ని ఉపయోగించి విరుగుడు చర్యలు చేపట్టొచ్చు. రాజకీయ ప్రత్యర్థుల్ని కట్టడి చేయొచ్చు! ఇదే జరిగితే, కచ్చితంగా అది పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కుకు భంగమే! మరి ఈ ప్రమాదం నుంచి రక్షణ ఏది?
- దిలీప్ రెడ్డి. dileepreddy.r@v6velugu.com