
- లోక్సభలో బిల్లుకు 311 మంది సభ్యుల మద్దతు
- అర్ధరాత్రి దాక సభ్యుల వాదోపవాదాలు
- మైనారిటీలకు వ్యతిరేకమని ఆరోపణలు
- పౌరసత్వానికి మతానికి లంకె పెట్టొద్దు
- కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల విమర్శలు
- సభలోనే ప్రతులు చింపేసిన ఒవైసీ
- ఆరోపణలను తిప్పికొట్టిన అమిత్ షా
- భారతీయ ముస్లింలకు నష్టం జరగదు
- దేశ విభజనకు కాంగ్రెస్సే కారణం
సిటిజన్షిప్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇరుగు పొరుగు దేశాల్లో ఇబ్బందివడి మన దేశానికి వలసొచ్చిన నాన్ముస్లింలకు సిటిజెన్షిప్ ఇయ్యాలె అన్న కేంద్రం మాటకు ప్రతిపక్షాలు ససేమిరా అన్నయ్. దీనికోసం ప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండమెంట్ బిల్లుపై విమర్శలు గుప్పించినయ్. మతం పేరుతో ఈ విభజన ఏంటని, సిటిజెన్షిప్కు మతానికి లంకె పెట్టుడేందని మండిపడినయ్. రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అడ్డంగా నడవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై సభ్యుల అనుమానాలన్నీ తీరుస్తం.. అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులిస్తం కానీ ఎవరూ వాకౌట్ చేయొద్దని షా విజ్ఞప్తి చేశారు. అన్నట్లుగానే ఉదయం మొదలైన చర్చ, వాడివేడి వాదనలతో అర్ధరాత్రి దాకా కొనసాగింది. సభ్యుల ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం జవాబులిచ్చే ప్రయత్నం చేసింది. మైనారిటీలపై కేంద్రం తీరుకు నిరసనగా మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతులను చింపేశారు..
న్యూఢిల్లీ: సిటిజెన్షిప్ బిల్లుపై సోమవారం లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. మెజారిటీ సభ్యుల మద్దతుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను షా కొట్టిపారేశారు. సభ్యుల సందేహాలన్నింటికీ ప్రభుత్వం జవాబిస్తుందని, ఎవరూ వాకౌట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా అమిత్ షా దీనిని సమర్థించారు. ఈ బిల్లు రాజ్యాంగానికి, మైనారిటీలకు వ్యతిరేకమన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నూటికి నూరు శాతం రాజ్యాంగ విలువలకు లోబడే ఈ బిల్లును తయారుచేశామని వివరణ ఇచ్చారు. అంతకుముందు ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలా వద్దా అన్న ప్రశ్నకు 293 మంది సభ్యులు సమ్మతించగా.. 82 మంది ఎంపీలు వ్యతిరేకించారు. బిల్లుపై చర్చ సందర్బంగా సభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దేశవిభజనను గుర్తుచేస్తూ మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని అమిత్ షా విమర్శించారు. దీనిపై మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు.. రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వీడీ సావర్కరేనని కౌంటర్ ఇచ్చారు. తర్వాత అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ సవరణ బిల్లు తీసుకురావాల్సి వచ్చిందంటే కారణం కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పును సరిదిద్దేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని షా చెప్పారు. దీనివల్ల పౌరుల హక్కులకు వచ్చిన ముప్పేమీ లేదని హోంమంత్రి అమిత్ షా వివరించారు.
బిల్లు తేవడమే పెద్ద తప్పిదం: కాంగ్రెస్
సిటిజెన్షిప్ సవరణ బిల్లు తేవడమే అతిపెద్ద తప్పిదమని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఆరోపించారు. బిల్లు అసంపూర్తిగా ఉందని విమర్శిస్తూ.. దీనివల్ల కొన్ని వర్గాలపై పక్షపాతం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. మరో ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. దేశంలోని మైనారిటీలు టార్గెట్గా ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వం కల్పించేందుకు మతాన్ని ఆధారం చేసుకోవడం లౌకిక వ్యవస్థకు విరుద్ధమని ఎంపీ ప్రేంచంద్రన్ ఆరోపించారు. శశిథరూర్, సౌగతరాయ్, గౌరవ్ గొగోయ్, అసదుద్దీన్ఒవైసీ తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.
బిల్లు ప్రతిని చింపేసిన ఒవైసీ
కేంద్రం ప్రవేశపెట్టిన సిటిజెన్షిప్ అమెండమెంట్ బిల్లును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. మైనారిటీలను అణగదొక్కేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా నుంచి ఈ దేశాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. సిటిజెన్షిప్ అమెండమెంట్బిల్లు ప్రతులను ఒవైసీ చింపేశారు.
మార్పులు చేస్తేనే మద్దతు: ఎంపీ నామా
సిటిజెన్షిప్ సవరణ బిల్లును ముస్లింలకూ వర్తింపజేయాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఆ మేరకు బిల్లులో మార్పులు చేసి, సభలో మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. మార్పులుచేస్తే తప్ప బిల్లుకు మద్దతివ్వబోమని ఆయన కేంద్రానికి స్పష్టం చేశారు.
బిల్లులో ఏముంది?
ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వేధింపులు తట్టుకోలేక వలస వచ్చిన నాన్ముస్లిం శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే.. ఇలా వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా గుర్తించరు. దీనిపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. దేశంలోని అక్రమ వలసదారులను తిప్పిపంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఈశాన్య రాష్టాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సవరణ బిల్లును కాలరాయనుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.