
హైదరాబాద్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారని గతంలో శ్రీనివాస్ హైకోర్టుని ఆశ్రయించారు. రమేశ్ జర్మన్ పౌరసత్వం నిజమేనని గతేడాది డిసెంబర్లో నిర్ధారించిన కోర్టు, శ్రీనివాస్ కు రూ.25లక్షలు, న్యాయసేవ ప్రాధికార సంస్థకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ రమేశ్ జరిమానా కట్టారు.
చెన్నమనేని క్షమాపణలు చెప్పాలి: ఆది
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటిజన్ కాదని తాను ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేండ్ల క్రితమే తాను ఎమ్మెల్యే అయ్యేవాడిని తెలిపారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని చెప్పారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.