అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

యాదాద్రి, వెలుగు: అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ ​చేశారు. ఆదివారం భువనగిరిలో జరిగిన అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐసీడీఎస్​ను పథకంగా కాకుండా ప్రభుత్వ శాఖగా గుర్తించాలన్నారు. ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు.

అంగన్​వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు.  సుప్రీంకోర్టు, కాగ్ నివేదికను కేంద్రం పట్టించుకోకుండా ఐసీడీఎస్​ను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంతకు ముందు అంగన్​వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.