- సమస్యలపై సీఐటీయూ వాల్ పోస్టర్ విడుదల
కోల్బెల్ట్, వెలుగు: గని కార్మికుల సమస్యలపై సీఐటీయూ యూనియన్ వాల్ పోస్టర్ విడుదల చేసింది. ఆదివారం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ యూనియన్ ఆఫీసులో వాల్ పోస్టర్ విడుదల చేసిన నేతలు మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో అధికారికంగా సంప్రదింపులు జరపలేకపోతున్నామన్నారు.
పలుసమస్యలపై పోరాటానికి వాల్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి 3 శాతం వాటా చెల్లించాలని, సీఎంపీఎఫ్ ఆన్లైన్లో తప్పులను సరిచేసి పెండింగ్ చిట్టీలను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు రివైజ్డ్ పెన్షన్, గ్రాట్యుటీ చెల్లించాలని, సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోల్ ఇండియాలో అమలవుతున్న అలవెన్సులపై ఆదాయపన్ను మాఫీని సింగరేణిలో కార్మికులకు అమలు చేయాలని, సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో సంతకాలు సేకరించి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వెంకటస్వామి, అల్లి రాజేందర్, ఆర్గనైజర్లు జోరుక వెంకటేశ్, చైతన్య రెడ్డి, కల్వల శ్రీనివాస్, కాసిపేట-2 అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ధనిశెట్టి సురేశ్, సీనియర్ నేత సంజీవులు తదితరులు పాల్గొన్నారు.