
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేట బతుకమ్మ కుంట చెరువు స్థలం తనదంటూ కోర్టుకెక్కిన యెడ్ల సుధాకర్ రెడ్డి వాదనలో నిజం లేదని సిటీ సివిల్ కోర్టు తేల్చి చెప్పింది. అతను వేసిన రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రెవెన్యూ రికార్డులు, విలేజ్ మ్యాప్‌లు, శాటిలైట్ఇమేజ్లు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా హైడ్రా తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. నెల రోజులపాటు వాదోపవాదనలు విన్న జడ్జి ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దీంతో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలిగాయి.
హైడ్రా తరఫున వాదనలు వినిపించిన హైడ్రా, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు కె.అనిల్‌కుమార్, ఎస్.శ్రీనివాస్, బి.అజయ్, ప్రభుత్వ తరఫు న్యాయవాది బి.జనార్దన్, హైడ్రా లీగల్ అంశాలను పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్ మోహన్, హైడ్రా న్యాయ సలహాదారు శ్రీనివాస్‌తో పాటు సహచర లాయర్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. 1962– 63 లెక్కల ప్రకారం అంబర్‌పేట మండలం బాగ్అంబర్‌పేటలోని సర్వే నంబర్563లో బతుకమ్మ కుంట 14.06 ఎకరాలు కాగా, బఫర్ జోన్‌తో కలిపి మొత్తం 16.13 ఎకరాలు. కబ్జాలకు గురై ఇప్పుడు కేవలం 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ మొత్తాన్ని హైడ్రా అభివృద్ధి చేస్తుండగా సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగాయి. తాజా తీర్పుతో పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.