TRS కార్పొరేటర్‌కు ముగ్గురు సంతానం.. ఎన్నిక చెల్లదన్న కోర్టు

TRS కార్పొరేటర్‌కు ముగ్గురు సంతానం.. ఎన్నిక చెల్లదన్న కోర్టు

బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్టుగా తీర్పు

అంబర్ పేటలో బీజేపీ నేతల సంబురాలు

హైదరాబాద్ : అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ కార్పొరేటర్ ఎన్నిక చెల్లదంటూ సిటీ సివిల్ కోర్టు తీర్పునివ్వడంతో…  ఆ డివిజన్ బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. 2016లో జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో BJP అభ్యర్థి కన్నె ఉమ రమేష్ యాదవ్ పై TRS అభ్యర్థి ఎక్కాల చైతన్య కన్నా యాదవ్ గెలుపొందారు. గెలుపొందిన TRS అభ్యర్థికి ముగ్గురు సంతానం ఉన్నారనీ.. ఆమె ఎన్నిక చెల్లదంటూ చంద్రశేఖర్ అనే న్యాయవాది సిటీ సివిల్ కోర్ట్ లో కేసు వేశారు.

సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి TRS అభ్యర్థి  ఎక్కాల చైతన్య కన్నా యాదవ్ ఎన్నిక చెల్లదని… రెండో స్థానంలో ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి కన్నె ఉమ రమేష్ యాదవ్ కార్పొరేటర్ గా కొనసాగించాలంటూ ఇవాళ తీర్పు చెప్పారు.  ఈ తీర్పుతో కాచిగూడలో BJP నాయకులు సంబరాలు చేసుకున్నారు.

తమకు ఉన్నది ఇద్దరు సంతానమే అని… తప్పుడు ధ్రువపత్రాలు సృష్రించి కోర్టును తప్పుదోవ పట్టించారని TRS అభ్యర్థి అన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఎక్కాల చైతన్య చెప్పారు.