రూ.936 కోట్లతో నగరాభివృద్ధి
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా రూ. 936 కోట్ల నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గడిచిన 50 ఏళ్లలో కంటే ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడింతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని వివరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పురోగతిలో ఉన్న ఆయా పనులతో పాటు చేపట్టాల్సిన పనులకు స్థల సేకరణ, బిల్లుల చెల్లింపులు, నిధుల లభ్యత తదితర అంశాలపై సమీక్షించారు. రెండు నెలల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల పరిశీలన కోసం నిజామాబాద్ పర్యటనకు రానున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిహారం ఇవ్వలే..!
నివాసం గుడిసె కాలిపోయి సర్వం పొగొట్టుకున్న ఆ ఫ్యామిలీకి నెలన్నర దాటిన గవర్నమెంట్ నుంచి పైసా పరిహారం అందలేదు. మూడు సార్లు కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చి విన్నవించినా ఇంకా తమకు సాయం అందలేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వాడికి చెందిన సంపంగి బాలమణి ఫ్యామిలీ మెంబర్లు వాపోయారు. దుర్గయ్య, బాలమణికి చెందిన గుడిసె అక్టోబర్ 9న కాలిపోయింది. ఆ మంటల్లో వస్తువులు, బట్టలు, రూ.1.20 లక్షలు బూడి దయ్యాయి. రెవిన్యూ ఆఫీసర్లు పంచనామా చేశారు. నెల గడిచినా ఎలాంటి ఆర్థిక సాయం అందక పోవడంతో ఈనెల 7న ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. మధ్యలో కూడా వచ్చారు. సోమవారం మరోసారి ప్రజావాణిలో బాలమణి, ఆమె కోడలు రచన వినతి పత్రం ఇచ్చారు. - కామారెడ్డి, వెలుగు
పెన్షన్ కోసం పాట్లు..
వికలాంగుల పెన్షన్ కోసం ఎన్ని మార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదని పలువురు పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నారావత్ రాజుకు 81 శాతం వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నా కూడా పెన్షన్ రావడం లేదు. ఇప్పటికే పలు మార్లు వినతి పత్రం అందజేసిన ఆయన సోమవారం మరోసారి అర్జీపెట్టుకున్నాడు. అలాగే ఆర్మూర్ మండలం పత్తేపూర్‌కు చెందిన ఎన్.బసవయ్య కూడా వికలాంగుల పెన్షన్ కోసం మెమోరాండం అందజేశాడు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
సంజయ్‌కు స్వాగతం పలికిన ఎంపీ
ఆర్మూర్, వెలుగు: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మీదుగా నిర్మల్ వెళ్తున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌కు ఆ పార్టీ నేతలు సోమవారం ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్ పెర్కిట్ వద్ద సంజయ్‌ను సత్కరించారు. అనంతరం ఆయనతో కలిసి నిర్మల్‌కు బయలుదేరారు.
ఫారెస్ట్ సిబ్బందికి అండగా ఉంటాం : సీపీ నాగరాజు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి తాము అండగా ఉంటామని సీపీ కేఆర్. నాగరాజు హామీ ఇచ్చారు. గొత్తికోయల దాడిలో చనిపోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ చెలిమెల శ్రీనివాస్‌కు సంతాప సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫారెస్ట్ సిబ్బందికి తాము తోడుగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అరవింద్ బాబు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఏసీపీలు వెంకటేశ్వర్, ప్రభాకర్ రావు, కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
14వ రోజూ కొనసాగిన యాత్ర
నిజామాబాద్, వెలుగు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ నేత డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి చేస్తున్న జనంతో మనం పాదయాత్ర 14వ రోజుకు చేరింది. సోమవారం భీంగల్ మండలం పల్లికొండ గ్రామం నుంచి లింగాపూర్ మీదుగా పురానిపేట్ వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు భీంగల్ మండలాన్ని డ్రగ్స్ విక్రయాలకు ప్రధాన కేంద్రంగా తయారు చేశారని ఆరోపించారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాదయాత్రలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, భీంగల్ పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, మండల అధ్యక్షుడు ములిగె మహిపాల్, బీజేవైఎం ఇన్‌చార్జ్ కనికరం మధు, మండల నాయకులు పాల్గొన్నారు.