15 నిమిషాల్లో సిటీని మింగేసింది

  • 2 వేల ఏళ్ల క్రితం పాంపేలో అగ్ని పర్వతం పేలుడు.. శిథిలాలపై సైంటిస్టుల రీసెర్చ్

రెండు వేల ఏండ్ల కిందట ఇటలీలోని వెసువియస్ అగ్నిపర్వతం బద్దలై దాని పరిసర సిటీలను ముంచెత్తింది. క్రీశ.79వ సంవత్సరంలో జరిగిన ఈ విప్పోటనంతో ప్రాచీన రోమన్ సిటీ పాంపే బూడిదైపోయింది. ఆ సిటీలోని వేల మంది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయారు. వెసువియస్ అగ్నిపర్వత విస్పోటనం.. చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా చెప్తారు. ఈ పేలుడుతో మొత్తం 20 వేల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద, విష వాయువుల వల్లే పాంపే సిటీలో రెండు మూడు వేల మందికి పైగా మరణించారని రోమ్‌‌లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ సైంటిస్టులు నాటి శిథిలాలపై చేసిన అధ్యయనంలో ఆధారంగా వెల్లడించారు. 
రోమన్ నాగరికతను చెప్పే సిటీలు 
మొదటి శతాబ్దంలో పాంపే విలాసవంతమైన కోటలతో అభివృద్ధి చెందిన ఇండస్ట్రియల్ హబ్‌గా పాంపే ఉండేది. ఈ నగరంలో దాదాపు 20 వేల మంది జనాభా ఉన్నట్లు అంచనా. క్రీస్తు శకం 79 అక్టోబర్ 24న వెసువియస్ అగ్ని పర్వతం పేలింది. దాని చుట్టు పక్కల పట్టణాలైన ఆప్లోంటిస్, పాంపే, స్టేబియా, హెర్క్యులేనియం పూర్తిగా నాశనం అయ్యాయి. బూడిద, లావా కింద తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 20 నిమిషాల పాటు దట్టమైన పొగ, విషపూరిత వేడి గాలులు పాంపే సిటీని ముంచెత్తాయని, దీంతో ఊపిరాడక ఎక్కడివారక్కడే ప్రాణాలు కోల్పోయారని తాజా స్టడీలో తేలింది. అగ్ని పర్వతం పేలిన తర్వాత వచ్చిన 1800 డిగ్రీల హీట్‌తో, గంటకు 724 కిలోమీటర్ల స్పీడ్ గా చుట్టుపక్కల ఏరియాలకు వ్యాపించాయని సైంటిస్టులు చెబుతున్నారు. దాదాపు 1700 ఏండ్ల తర్వాత అక్కడ తొలిసారి తవ్వకాలు జరిగాయని,   తవ్వకాల్లో బయటపడిన శిథిలాల ఆధారంగా వేల ఏండ్ల నాటి రోమన్ నాగరికత, నాటి విలాసవంతమైన జీవన శైలి తెలుస్తోందని వారు అంటున్నారు. 

తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ..
‘వెసువియస్ అగ్ని పర్వత పాదం వద్ద ఉన్న హెర్క్యూలేనియం సిటీకి వేడి గాలులు చాలా బలంగా తాకుతాయి కాబట్టి పేలుడు ధాటికి ఆ సిటీ తప్పించుకోవడం సాధ్యం కాదు. పాంపే సిటీ పర్వతం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా కొన్ని నిమిషాల గ్యాప్‌లోనే అగ్ని పర్వతం బూడిద, విషవాయువులు చుట్టుముట్టాయి. దాని నుంచి తప్పించుకోవచ్చని చాలా మంది ఇళ్లల్లో దాక్కున్నారు. ఏం జరుగుతుందో వారు ఊహించలేకపోయారు. వేడి, విష వాయువులు దాదాపు 15 నిమిషాల్లో సిటీని కప్పేశాయి. దీంతో ఊపిరాడక వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు’ అని రోమ్‌‌లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ సీనియర్ సైంటిస్ట్ రాబర్టో ఇసియా తన సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌‌లో పేర్కొన్నారు. అగ్ని పర్వతం పేలుడు హీట్ హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణు బాంబుల వేడి కంటే లక్ష రెట్లు ఎక్కువగా ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేశారు. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్‌తో పాంపే సిటీని చుట్టుముట్టిన బూడిద దాదాపు 30 అడుగుల మేర పేరుకుపోయింది. 18వ శతాబ్ధం మధ్యలో జరిపిన తవ్వకాల్లో పాంపేని స్పానిష్ మిలటరీ ఇంజనీర్లు కనుగొన్నారు. తవ్వకాల్లో బయటపడిన సిటీ శిథిలాలు, డెడ్ బాడీల ఆనవాళ్లతో అక్కడ మ్యూజియంతో పాటు సిటీ మోడల్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. ఏటా పది లక్షల మంది పర్యాటకులు వస్తున్నారని ఇటలీ అధికారులు చెబుతున్నారు.