
- బడ్జెట్ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ
ఖమ్మం టౌన్, వెలుగు : కార్పొరేషన్ ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ సూచించారు. పక్కా ప్రణాళికలతో కార్పొరేషన్‌లో ప్రత్యేక మార్పులు తీసుకురావాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ ఆధ్యక్షతన బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో 2023–24 సవరణ 220.54 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రూ.187.86 కోట్లతో రూపొందించిన అంచనాలు ఆమోదించారు. ఖమ్మం కార్పొరేషన్ లోని 60 డివిజన్ ల కార్పొరేటర్లకు గాను 43 మంది బడ్జెట్ సమవేశానికి అటెండయ్యారు.
17 మంది గైర్హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులో 10 శాతం తప్పనిసరిగా గ్రీనరీ కొరకు వినియోగించాలన్నారు. గృహ, వాణిజ్య సముదాయాలన్నింటిని గుర్తించి పన్నుల వసూళ్లను పకడ్బందీగా నిర్వహించి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని సూచించారు.
భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. 2023–-24కు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి సవరించిన 78.68 కోట్లకు ఆమోదం తెలిపారు. 2024–-25కు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.80.67 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు.
బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పనులు
బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పనులు చేపట్టి పూర్తి చేయాలని శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్ అన్నారు. గ్రీనరీకి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పారు. మున్సిపల్ ఆదాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అద్దెలు వసూలు చేసి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహరా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.