ఎవరిని కదిలించినా కన్నీళ్లే : కట్టుబట్టలతో మిగిలిపోయిన మున్నేరు బాధితులు

ఎవరిని కదిలించినా కన్నీళ్లే :  కట్టుబట్టలతో మిగిలిపోయిన మున్నేరు బాధితులు
  • ఇండ్లల్లోకి భారీగా చేరిన బురద
  • పనికి రాకుండాపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు
  • వరదలో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు, బట్టలు
  • ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. మున్నేరు, లకారం వాగులు ఉప్పొంగడంతో ఇండ్లన్నీ నీట మునిగాయి. దీంతో వరద బాధితులంతా ఇండ్లల్లో చేరిన బురదను తొలగిస్తున్నరు. వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయాయి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. ఇండ్లల్లోని సామాన్లతో పాటు నిత్యావసరాలన్నీ పాడైపోయాయి. టీవీలు, ఫ్రిడ్జ్ లు, కూలర్లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. గ్యాస్ సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

మున్నేరు వాగును ఆనుకొని ఉన్న కాలనీల్లో కార్లు కూడా కొట్టుకుపోయాయి. బైక్​లు, సైకిళ్లు బురదలో కూరుకుపోయాయి. రెండు రోజులు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకున్న బాధితులు.. సోమవారం ఇంటి దారి పట్టారు. ఇండ్లల్లో పేరుకుపోయిన బురదను చూసి బోరుమంటూ ఏడుస్తున్నరు. కట్టుబట్టలతో మిగిలిపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నరు.

30కి పైగా కాలనీలు జలమయం

ఖమ్మం సిటీలోని కవిరాజ్ నగర్, చైతన్యనగర్, ధంసలాపురం ఏరియాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. పోలేపల్లి, రాజీవ్ గృహకల్ప, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, కరుణగిరి, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, కాల్వొడ్డు ప్రాంతాల్లోని ఇండ్లల్లో బురద పేరుకుపోయింది. దాదాపు 30కి పైగా కాలనీల్లో పది అడుగుల మేర వరద ప్రవహించడంతో బీరువాల్లో దాచుకున్న సర్టిఫికెట్లు, బట్టలు కూడా పాడైపోయాయి.

చాలా ఇండ్ల కాంపౌండ్ వాల్స్ కూలిపోయాయి. రాజీవ్ గృహకల్పలో ఫస్ట్ ఫ్లోర్​కు వరద తాకింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇండ్లల్లో పాములు, తేళ్లు కనిపిస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. కవిరాజ్ నగర్ లో ఆరు అడుగుల మేర వరద ఇండ్లను ముంచెత్తాయి. మున్నేరు పక్కన ఉన్న కాలనీల్లోకి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు కొట్టుకుపోయి కంప చెట్లలో చిక్కుకుపోయాయి. ఆరు కార్లు అసలే కనిపించకుండా పోయాయని బాధితులు చెప్తున్నారు. టూ వీలర్లు, సైకిళ్లు, గ్యాస్ సిలిండర్లు కూడా కొట్టుకుపోయాయి.

కట్టుబట్టలతో మిగిలినం

ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఆదివారం రోజంతా పిల్లలతో పాటు డాబాపైనే ఉండిపోయాం. ఇంట్లో సజ్జ లెవల్ దాకా వరద ముంచెత్తింది. టీవీ, ఫ్రిడ్జ్ సహా అన్నీ పాడైపోయాయి. మంచాలు కూడా నీళ్లలో మునిగిపోవడంతో పనికిరాకుండా పోయాయి. రెండు క్వింటాళ్ల బియ్యం కూడా ఖరాబైనయ్. కట్టుబట్టలతో రోడ్డున పడ్డం. ప్రభుత్వమే ఆదుకోవాలి.  అక్కిరాజు ఆదిలక్ష్మి, సాయికృష్ణ నగర్, ఖమ్మం

Also Read :- ఆదుకోవాలని మున్నేరు వరద బాధితుల ధర్నా

ప్రభుత్వమే ఆదుకోవాలి

కొద్దినెలల కిందే కిరాయికి వచ్చినం. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పక్కింటిపైన మూడో ఫ్లోర్​లో భయపడు తూ కాలం వెల్లదీసినం. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే.. ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయి. తినడానికి తిండి లేని పరిస్థితి.

వండు కుందామన్న ఏం లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. సరుకు లు తెచ్చి ఇచ్చినా.. గిన్నెలు కూడా లేవు. ప్రభుత్వమే మా సమస్య పరిష్కరించాలి.
- అక్కిరాజు స్రవంతి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ