గండిపేట,వెలుగు: సివిల్ ఇంజనీర్ మర్డర్ కేసును నార్సింగి పోలీసులు చేధించారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ జి.హరికృష్ణరెడ్డి తెలిపిన ప్రకారం.. గోల్కొండ చోటాబజార్ కు చెందిన సయ్యద్ హిదాయత్ అలీ(31) సౌదీలో సివిల్ ఇంజనీర్. 20 రోజుల కిందట సొంతూరు గోల్కొండకు వచ్చాడు. స్థానికంగా కుటుంబంతో నివసించే సీమాబేగం(24) ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ అమీర్(29)తో రెండేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
కాగా సీమాబేగంను తనతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయమని కొన్నిరోజులుగా సయ్యద్ హిదాయత్ అలీ వేధిస్తున్నాడు. ఆమె తన ప్రియుడు సయ్యద్ అమీర్‌కు తెలిపింది. దీంతో హిదాయత్ అలీని పిలిచి మర్డర్ కు ప్లాన్ చేశారు. గత నెల 29న ఉదయం హిదాయత్ అలీ, సీమా బేగం కలిసి క్వాలిస్(ఏపీ27ఏడబ్ల్యూ2772)లో మంచిరేవులోని గ్రీన్ ల్యాండ్స్ కాలనీకి వచ్చారు. సయ్యద్ అమీర్ వెనకాల బైక్‌పై ఫాలో అయ్యాడు.
నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ హిదాయత్ అలీతో అమీర్ గొడవకు దిగాడు. పక్కనే ఖాళీ ప్లాట్‌లోకి హిదాయత్ అలీని తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. హిదాయత్ అలీ స్పాట్ లో మృతి చెందాడు. అనంతరం సయ్యద్ అమీర్, సీమా బేగం బైక్‌పై వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. సయ్యద్ అమీర్, సీమా బేగంను నిందితులుగా గుర్తించి సోమవారం అరెస్టు చేశారు.