ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పువ్వాడ అజయ్​కుమార్​ను ఖమ్మం నగర పౌరసమితి, ఛాంబర్​ ఆఫ్​ కామర్స్, టీఎన్జీవోస్, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఖమ్మం గ్రెయిన్​ మార్కెట్​ నుంచి భారీ కాన్వాయ్​తో మంత్రి పువ్వాడ నగరంలోని సప్తపది ఫంక్షన్​ హాల్​కు తరలివచ్చారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించారు. త్రీటౌన్​ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడను గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్​ మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి, శాంతిభద్రతల విషయంలో రాజీ పడడం లేదన్నారు. డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్య, నగర మేయర్​ నీరజ, పులిపాటి ప్రసాద్, ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ చిన్ని కృష్ణారావు, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు ఆఫ్జల్ హసన్, టీఆర్ఎస్  నగర​అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్​ కూరాకుల వలరాజు పాల్గొన్నారు.

ఖాతాదారుల నమ్మకంతోనే అభివృద్ధి

ఖమ్మం టౌన్, వెలుగు: ఖాతాదారుల నమ్మకంతోనే భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు అన్నిరంగాల్లో ముందంజలో ఉండడం అభినందనీయమని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. సిటీలోని వాసవి గార్డెన్ లో ఆదివారం భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ను నిర్వహించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజ్ రవిచంద్ర, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్  జిల్లా అధ్యక్షుడు తాతా మధులను బ్యాంక్​ చైర్మన్ శాలువాతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంక్​ షేర్ హోల్డర్స్ మన్ననలు పొందడం, చిరు వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆర్థికంగా చేయూత ఇచ్చిందని కొనియాడారు. ఉద్యోగుల కృషితో 16 బ్రాంచీలతో  25 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ ఏడాది మరో 5 కొత్త బ్రాంచ్​లను ప్రారంభిస్తామని చెప్పారు. బ్యాంకులో అప్పు తీసుకున్న ఖాతాదారులు సకాలంలో చెల్లించి సహకరించడంతోనే అభివృద్ధి సాధించామని తెలిపారు. సిటీ మేయర్ పూనుకోలు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్​ బచ్చుకూరకుల నాగభూషణం, ఛాంబర్  ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, శ్రీ సిటీ అధినేత గరికపాటి వెంకట్​రావు, రేఖల భాస్కర్ రావు, మేళ్లచెర్వు వెంకటేశ్వర్లు, బ్యాంకు వైస్ చైర్మన్లు సన్నే ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, సీఈవో ముక్కమల కామేశ్వరరావు పాల్గొన్నారు.

సీఎం ప్రసంగంపై బీజెపీ నిరసన

ఖమ్మం కార్పొరేషన్/వైరా, వెలుగు: విమోచనం దినం సందర్భంగా సీఎం కేసీఆర్​ ప్రసంగంపై బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్, కొమురం భీం వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించలేదని పార్టీ నాయకులు ఆరోపించారు. శ్రీశ్రీ సర్కిల్​ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు, అంజయ్య, రమేశ్, సుగుణ, నాగేశ్వర్​రావు, సురేశ్, శ్రీను, తిరుపతయ్య పాల్గొన్నారు.

కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం

ప్రజా ఘోస కార్యక్రమంలో భాగంగా వైరాలో రెండో రోజు బైక్​ ర్యాలీ నిర్వహించారు. టౌన్, రూరల్​ పార్టీ అధ్యక్షులు ఏలే భద్రయ్య, కోసూరి గోపాలకృష్ఱ ఆధ్వర్యంలో స్నానాల లక్మీపురం నుంచి వైరా, దిద్దుపూడి, పల్లిపాడు, సోమవారం మీదుగా యాత్ర సాగింది. వైరా రింగ్ రోడ్  సెంటర్ లో సీఎం​దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్యాంనాయక్  పాల్గొన్నారు.

కూనంనేనితో ఎమ్మెల్యే కందాల భేటి

ఖమ్మం రూరల్, వెలుగు: వారం రోజులుగా పాలేరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలవడం చర్చనీయాంశమైంది. ఆదివారం మండలంలోని గూడూరుపాడు గ్రామంలో సీపీఐ కార్యవర్గ సభ్యుడు పుచ్చకాయల కమలాకర్ ఇచ్చిన విందులో కలిసిన వీరు కొద్దిసేపు వ్యక్తిగత విషయాలపై మాట్లాడుకున్నారు. ఇటీవల రూరల్ సీఐపై కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేశ్​ హాజరయ్యారు.

యువతతోనే దేశాభివృద్ధి సాధ్యం

సత్తుపల్లి, వెలుగు: యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఆదివారం కాలేజ్ సెల్ఫ్ మేనేజ్​మెంట్ ఉమెన్స్ హాస్టల్ లో బహుమతులు అందించారు. ప్రధాని మోడీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విద్యార్థులు అద్భుతమైన చిత్రాలు గీశారని అభినందించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, జిల్లా కార్యదర్శి మున్నా మిశ్రా, కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి మధుసూదన్, పాలకొల్లు శ్రీను, బొర్రా నరసింహారావు, వసంత రావు, శ్యాంసుందర్, వల్లెపు రాధాకృష్ణ పాల్గొన్నారు.

పోడు సమస్యను పరిష్కరించడంలో విఫలం

వైరా, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ(ఎంఎల్)  ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రామచంద్రయ్య రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి గోగినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం వైరాలోని కమ్మవారి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి  కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ  పోడు భూముల సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల సమస్య నేటికీ పరిష్కారం కాలేదన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు.   

కార్మికుల సంక్షేమమే లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణితో పాటు దేశంలోని బొగ్గు గని కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా బీఎంఎస్​ పని చేస్తుందని సంఘం​కోల్​ విభాగం నేషనల్​ ఇన్​చార్జి, జేబీసీసీఐ మెంబర్​ కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లోని ఆర్సీవోఏ క్లబ్​లో ఏర్పాటు చేసిన సింగరేణి కోల్​మైన్స్​ కార్మిక సంఘ్​ కొత్తగూడెం రీజియన్​ స్టడీ క్లాసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వేతన ఒప్పందం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఏబీకేఎంఎస్​ జాతీయ కార్యదర్శి పి. మాధవ్​ నాయక్, బీఎంఎస్​ స్టేట్​ సెక్రటరీ రమాకాంత్, వర్కింగ్​ కమిటీ మెంబర్​ పులి రాజారెడ్డి, కార్యవర్గ సభ్యులు సీహెచ్​ రాంచందర్​ ఫ్యాకల్టీగా వ్యవహరించారు. యూనియన్​ నాయకులు ఎం. ప్రభాకర్​రావు, సంగం చందర్, ఎం. శ్రీనివాస్, జీవీ కృష్ణారెడ్డి, మెగిలిపాక రవి, పవన్​ కుమార్​ పాల్గొన్నారు. 

జీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ములకలపల్లి, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ యూసుఫ్  డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏఐటీయూసీ కార్యాలయంలో సుంకర ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకొర  వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.21,500 ఇవ్వాలని, కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని, కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి బాబురావు,  సంజీవరావు, వెంకటేశ్వర్లు, గద్దల మహేశ్, రాజు, కొత్తపల్లి కృష్ణ, బేరి రమాదేవి  పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాములు నాయక్​ అల్లుడి మృతి

ఖమ్మం రూరల్, వెలుగు: వైరా ఎమ్మెల్యే  రాములు నాయక్ అల్లుడు జూపల్లి ప్రదీప్​కుమార్​ శనివారం రాత్రి గుండెపోటుతో చనిపోయాడు. అబ్కారీ శాఖలో ప్రదీప్​ పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు మండలంలోని టీఎన్జీవో కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే రాములు నాయక్, ఆయన కూతురు ఎక్సైజ్​ సీఐ  జయశ్రీతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. జడ్పీటీసీ ఎండపల్లి వరప్రసాద్, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, నల్లమల్ల వెంకటేశ్వరరావు, మౌలానా తదితరులు నివాళులు అర్పించారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఖమ్మం పటేల్​ స్టేడియం, కొత్తగూడెం క్లబ్​లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఖమ్మంలో జరిగిన వేడుకలో కమెడియన్లు ఆది, గణపతి, నరేశ్​ స్కిట్లు చేయగా, సింగర్లు సింహ, మోహన భోగరాజు పాటలతో అలరించారు. పలువురు తెలంగాణ సాయుధ పోరాట యోధులను సన్మానించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,  కలెక్టర్  గౌతమ్, పోలీస్  కమిషనర్  విష్ణు ఎస్​ వారియర్, మేయర్ నీరజ పాల్గొన్నారు. కొత్తగూడెంలో స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను కలెక్టర్​ అనుదీప్​ అధ్యక్షతన సన్మానించారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్​ హరిప్రియ, అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, మున్సిపల్​ చైర్మన్లు డి. వెంకటేశ్వరరావు, కె. సీతాలక్ష్మి పాల్గొన్నారు. 

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్యకు ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం చినజీయర్​స్వామి సమర్పించిన బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం సమస్త నదీజలాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. చేశారు. మధ్యాహ్నం రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

కోయ నర్సాపురంలో వైద్యశిబిరం

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం కోయనర్సాపురం ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పీఎస్ఆర్​ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వైద్యశిబిరం నిర్వహించారు. సర్పంచ్​ అనిత శిబిరాన్ని ప్రారంభించగా వైద్యులు సురేందర్, మహ్మద్​ ఫరీద్, అనిల్​కుమార్, అలీనాశాంతి మన్యంలో ప్రబలుతున్న వ్యాధులపై అవగాహన కల్పించారు. 370 మంది రోగులకు ఉచితంగా వైద్య,రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి నిర్వాహకులు​బాబురెడ్డి, రవిరెడ్డి, ఉప సర్పంచ్​ గంగరాజు పాల్గొన్నారు.

ముర్రేడు వాగులో బాలుడు గల్లంతు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెంలోని ముర్రేడు వాగులో  రెనీ(11) అనే బాలుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఇద్దరు పిల్లలు ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లారు. రెనీ వాగులోకి ఈతకు దిగగా, ఇసుక తవ్వకాలతో వాగులో ఏర్పడ్డ గుంతలో పడి గల్లంతయ్యాడు. తల్లి జ్యోతి త్రీ టౌన్  పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, గజ ఈతగాళ్లతో గల్లంతైన బాలుడి కోసం గాలించారు. చీకటి కావడంతో  సోమవారం ఉదయం బాలుడి కోసం గాలిస్తామని సీఐ అప్పయ్య తెలిపారు.

తాలిపేరులో దూకి ఎఫ్​బీవో సూసైడ్

చర్ల, వెలుగు: మండలంలోని తేగడ సమీపంలోని తాలిపేరు వాగులో దూకి ఫారెస్ట్​బీట్​ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీకాలనీ గ్రామానికి చెందిన కొర్స సూర్యనారాయణ(36) ఆదివారం మధ్యాహ్నం తాలిపేరు వాగులో దూకాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో డెడ్​బాడీని బయటకు తీశారు. మృతుడు తేగడ వెస్ట్​ బీట్​ ఆఫీసర్​గా పని చేస్తున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.