సివిల్​ సర్వెంట్స్​ తమ మనస్సులో ఏముందో చెప్పలేకపోయారు

ఈ మధ్య నా ప్రయాణంలో ఇంజనీరింగ్​ ఫైనల్​ ఇయర్​చదువుతున్న విద్యార్థులు ఇద్దరు కలిశారు. ఇద్దరూ మంచి పేరున్న కాలేజీలో చదువుతున్న ప్రతిభావంతుల్లాగ కనిపించారు. మరి అందరి లాగే వీరు కూడా అమెరికా వెళ్లి పోవాలని అనుకుంటున్నారా అని డౌట్​వచ్చింది. ‘మీ ఫ్యూచర్ ​ప్లాన్​ ఏంటి’ అని అడిగాను వాళ్లను. నేను అడగడమే ఆలస్యం ఓ యువకుడు సివిల్స్​ రాద్దామనుకుంటున్నానని చెప్పాడు. ఎందుకు అని అడిగిన. ‘‘సివిల్స్​కు కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ లుగా సెలెక్ట్​ కావొచ్చు. మళ్లీ ఏ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం చెప్పిందే వేదం. ఉద్యోగం చేసినంత కాలం ఎట్లా పనిచేసినా బ్రహ్మాండమైన జీతభత్యాలు. ఓ ఐఏఎస్ ​మామ దొరికితే తాజ్​ఫలక్​నుమా ప్యాలెస్​ లాంటి హోటల్​లో పెళ్లి చేసుకోవచ్చు. భవిష్యత్​లో అలాంటి ఫైవ్​స్టార్​ హోటల్​లో పిల్లల పెండ్లిళ్లు కూడా ఏ కాంట్రాక్టర్​కో చెప్పి చేయించవచ్చు’’ అని అన్నాడు ఉత్సాహంగా. అతని సమాధానానికి నేను ఆశ్చర్యపోయా. ఇంకా ఏమైనా చెబుతాడేమోనని అతని వైపు చూశా నవ్వుతూ, ‘‘అదృష్టం బాగుంటే ఎమ్మెల్సీనో, రాజ్యసభ మెంబర్​నో కూడా కావొచ్చు’’ అన్నాడు. అతని దూరదృష్టికి అవాక్కయ్యాను. ఇతని లాంటి ఆలోచన ధోరణి అందరిలో ఉండకపోవచ్చు అనుకొని మరో యువకుడు ఏం చెబుతాడో చూద్దామని అతనివైపు చూశా. ‘‘ నాకు సివిల్స్​ రాద్దామని లేదు. అమెరికా వెళ్లిపోదామని అనుకుంటున్నాను’ అన్నడు. ఎందుకు అని అడిగా. ‘‘ఏముంది సార్​! ఆ సర్వీస్​లో ఎంపీ కాళ్ల దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి కాళ్లు మొక్కాల్సి రావొచ్చు. అధికార పార్టీ ఆఫీస్​ ప్రారంభోత్సవాలకు హాజరు కావాల్సి వస్తుంది. ఇంకా మన తప్పు లేకపోయినా కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జైలుకు కూడా వెళ్లాల్సి ఉండొచ్చు. ఇవన్నీ నాకు ఇష్టం లేదు” అన్నాడు. ఇద్దరు మిత్రులు. రెండు భిన్నమైన ఆలోచన ధోరణులు. ఇద్దరూ నేటి ఆధునిక సమాజంలోని బ్యూరోక్రసీ ధోరణులను జాగ్రత్తగా గమనిస్తున్న వ్యక్తులే అనిపించింది. 

తాజా ఘటనలూ..

ఇటీవల సూర్యాపేట ఎస్పీ ‘‘జయహో జగదీశన్న’’అంటూ మంత్రి జగదీశ్‌‌ రెడ్డిని పొగిడి విద్యార్థులతో నినాదాలు చేయించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా ఇది జరిగింది. పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌ మాట్లాడుతూ.. ‘‘మంత్రి జగదీశ్‌‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి” అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ ఈ ఘటనను మైమరిపించారు. మంత్రులతో ఏం పనిలే అనుకున్నారో ఏమో! ఆయన ఏకంగా ముఖ్యమంత్రిపైనే స్తోత్ర పాఠాలు వల్లెవేశారు. అభినవ అంబేద్కర్ రూపంలో కేసీఆర్ కనిపిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో మామూలు అయిపోయాయి. ఈ సివిల్ సర్వెంట్స్ తమ నడవడిక నియమావళిని మరిచిపోయారు. రాజ్యాంగం ఉందన్న విషయం గుర్తు లేకుండా పోయింది.  వీళ్లని చూస్తే జాలి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండో యువకుడి ఆలోచనా ధోరణి తప్పని అనిపించలేదు. 

రాజకీయ బాస్​ల దగ్గర..

సివిల్స్​ రాసి ఎంపికైన వ్యక్తులన్నా, ఐఐటీలో చదివిన ఇంజనీరింగ్ ​విద్యార్థులన్నా మన సమాజంలో ఓ గొప్ప గౌరవం ఉంది. వాళ్లలో స్వయంసిద్ధంగా ఓ అధీకృత భావం నెలకొని ఉంటుంది. అయితే వీళ్లద్దరి వల్ల మన దేశంలో ఊహించని గొప్ప పనులు ఏవీ జరగలేదు. ఇస్రో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు చాలా మంది మామూలు ఇంజనీరింగ్​ కాలేజీల్లో చదివిన విద్యార్థులే. 165 ఏండ్ల క్రితం ఏర్పాటైన సివిల్​ సర్వీసెస్​ అప్పుడు ఎలా పనిచేసిందో ఇప్పుడు అలాగే పనిచేస్తున్నది. ఇంకా చెప్పాలంటే మరి కాస్త ఫ్యూడలిస్టిక్​గా మారింది.  రాజకీయ బాస్​ల దగ్గర బానిసలుగా పనిచేస్తూ, మిగతా వాళ్లను బానిసల మాదిరిగా చూస్తున్నారు. వాళ్ల అనుభవాన్ని క్రోడీకరిస్తూ వాళ్లు రాసిన ఒక్క పరిశోధనా పత్రం లేదు. సెమినార్ ​పత్రమూ దొరకదు.

అధికారం చలాయించడానికేనన్న..

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు కింది మెట్టు నుంచి పైమెట్టుకు వెళ్తారు. అమెరికా లాంటి దేశంలో పోలీసులు సర్జంట్ గా, లిమోటెనెంట్​గా, కెప్టెన్ గా, డిప్యూటీ ఇన్​స్పెక్టర్​గా, ఇన్​స్పెక్టర్​గా, డిప్యూటీ చీఫ్​గా, డిప్యూటీ కమిషనర్​గా, పోలీస్ ​చీఫ్​గా వెళ్తారు. మన దేశంలో మొదట జిల్లా అదనపు ఎస్పీ, సబ్​కలెక్టర్ ​స్థాయి నుంచి పైపదవులకు నిర్ణీత కాలంలో వెళ్తూ ఉంటారు. ఉద్యోగంలోకి రావడం రావడంతోనే అధికారం చలాయించడానికే వచ్చినట్టుగా ఉంటుంది వాళ్ల ప్రవర్తన. ‘‘గట్టి సివిల్​సర్వీస్ ​సపోర్ట్​ లేకపోతే బ్రిటీష్ ​రాజ్యం అంతరించి పోతుంది’’ అని హవుజ్​ఆఫ్​లార్డ్స్​లో 1924లో మార్క్వూస్​కర్జన్​అన్నారు. ఇదే అభిప్రాయాన్ని చాలా మంది 
అధికారులు వెలిబుచ్చారు. 

ఐఏఎస్, ఐపీఎస్​ల తీరు..

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏండ్లు గడిచినా, సివిల్​ సర్వెంట్స్​ ఎవరూ కూడా తమ మనస్సులో ఏముందో చెప్పలేకపోయారు. ఎస్​మెన్​గానే మిగిలిపోయారు. యజమానికే అంతా తెలుసు అన్న చందంగా మెదులుతున్నారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు ఈ సర్వీస్​ ఏవిధంగా ఉపయోగపడిందో ఎవరన్నా పరిశోధన జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోపాల క్రిష్ణ గాంధీ ఐసీఎస్​లను అదే రూపు మారిన ఐఏఎస్, ఐపీఎస్​లని అన్నారు. కేరళ డీజీపీగా పనిచేసిన ఆస్తానా ప్రకారం.. పరీక్షల ద్వారా వచ్చిన భూస్వామ్య సంస్కృతికి ప్రతిబింబాలు ఈ ఐఏఎస్​లు, ఐపీఎస్​లు. ఈ ఇద్దరు చెప్పిన మాటలకు మించి మరో మాట అనడం బాగుండదు. మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సివిల్ ​సర్వెంట్స్​ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. వాళ్లను చూసి జాలి పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నది. నాతో మాట్లాడిన ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలే అందుకు నిదర్శనం.

- మంగారి రాజేందర్, 
రిటైర్డ్​ జడ్జి