ఈ యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్‌

  • టార్గెట్​ 80 లక్షల టన్నులు.. కొన్నది సగమే
  • ప్రైవేటు వ్యాపారులకు అడ్డికి పావుశేరు అమ్ముకున్న రైతులు
  • నిరుడు యాసంగిలో 64.17 లక్షల టన్నులు కొన్న సర్కారు
  • ఇకపై మార్కెట్లలోనే కొనుగోళ్లు.. వ్యాపారులు చెప్పిందే రేటు

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం పంట కొనుగోళ్ల లక్ష్యాన్ని రాష్ట్ర సర్కారు చేరుకోలేదు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనాలని టార్గెట్ పెట్టుకున్న సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ.. ఇప్పటిదాకా 48.82 లక్షల  టన్నులను మాత్రమే సేకరించింది. గత యాసంగితో పోలిస్తే ఇది చాలా తక్కువ. నిరుడు యాసంగిలో 64.17 లక్షల టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ యాసంగి నుంచి సివిల్‌‌ సప్లయ్స్‌‌ సెంటర్లు బంద్‌‌ కానున్నాయి. మార్కెట్లలోనే కొనుగోళ్లు సాగుతాయని, ఇకపై ధాన్యం సేకరణ టార్గెట్​ను చేరుకోవడం కష్టమేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

అమ్ముకునేదెట్ల?

ఈ యాసంగిలో వరి సాగు 50 లక్షల ఎకరాల్లో జరిగినట్లు అంచనా. కోటీ 40 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వస్తే అమ్ముకునేది ఎట్ల అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు యాసంగిలో 64.17 లక్షల టన్నుల వడ్లను సర్కారు కొన్నది. అయితే కొనుగోళ్ల పేరుతో ఆరేండ్లలో రూ.7,500 కోట్లు నష్టపోయిందని, ఒక్క ధాన్యం కొనుగోళ్లకే రూ.4,500 కోట్ల నష్టం వచ్చిందని ఈ మధ్య సీఎం చెప్పారు. ఇలా నష్టం పేరుతో కొనుగోళ్ల నుంచి సర్కారు తప్పించుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లలో అడ్తీదారులకు అమ్ముకోవడం మినహా మరో దారి లేదని సీఎం సంకేతాలు ఇచ్చారు.

సివిల్‌‌ సప్లయ్స్‌‌ కొనుగోళ్లు బంద్‌‌

రాష్ట్రం వచ్చిన కొత్తలో 2014-–15లో రెండు సీజన్లలో కలిపి 24.29 లక్షల టన్నులు మాత్రమే సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ కొనుగోళ్లు ఉండేవి. అయితే నిరుడు రెండు సీజన్లు కలిపి 1.11 కోట్ల టన్నుల ధాన్యాన్ని సర్కారు సేకరించింది. ఈ సారి వానాకాలంలో 1.32 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. కానీ ఇప్పటిదాకా 48.82 లక్షల టన్నులే కొన్నది. దీంతో రైతులు సన్న వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అడ్డికి పావుసేరుకు అమ్ముకుని ఇబ్బందిపడ్డరు. క్వింటాల్‌‌కు రూ.500 నష్టపోయారు. ఇక యాసంగిలో సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ధాన్యం కొనదని సర్కారు స్పష్టం చేసింది. గ్రామాల్లో సివిల్‌‌ సప్లయ్స్‌‌ కొనుగోలు కేంద్రాలు ఉండటంతో పంట అమ్ముకునేందుకు ఈజీగా ఉండేది. రైస్ మిల్లర్లు, దళారులను నియంత్రించటానికి, మార్కెటింగ్ బ్యాలెన్స్ కోసం సర్కారు కొనుగోళ్లు ఉపయోగపడేవి. ఇప్పుడు కొనడం ఆపేస్తే పంటలకు సరైన మార్కెట్ దక్కదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మార్కెట్‌‌లో నష్టమే

యాసంగిలో వడ్లు అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలే పెద్ద దిక్కుగా మారనున్నాయి. లైసెన్స్‌‌డ్‌‌ వ్యాపారస్తులే తప్ప ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ ఉండదు. రాష్ట్రంలోని 283 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సబ్ మార్కెట్లలోనే అమ్ముకోవాలి. వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. వ్యాపారులపై మార్కెటింగ్ శాఖకు నియంత్రణ లేక రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు.