ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి : దేవేంద్రసింగ్ చౌహాన్​

ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి : దేవేంద్రసింగ్ చౌహాన్​
  • సివిల్​ సప్లయిస్​ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్​

మంచిర్యాల, వెలుగు : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా చేపట్టాలని సివిల్​సప్లయిస్​కమిషనర్ డీఎస్​ చౌహాన్​ ఆదేశించారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్​లో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్​ కలెక్టర్ సబావత్ మోతీలాల్​తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో రివ్యూ​ నిర్వహించారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించడంలో జాగ్రత్త వహించాలని, సన్నాలు, దొడ్డురకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాంటా వేసిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్​ ఎంట్రీ చేసి 48 గంటల్లోగా వారి అకౌంట్లలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సెంటర్లకు19.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, 14.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. ఇందులో సన్నాలు 3.44 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. టార్గెట్​ ప్రకారం రైస్ మిల్లులు పనిచేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహించిన మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. జిల్లాలో 326 సెంటర్లకు గాను ఇప్పటివరకు 303 ఓపెన్​ చేశామని కలెక్టర్ ​తెలిపారు. మొత్తం 3.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా, 3,550 మెట్రిక్ టన్నులు  సెంటర్లకు వచ్చిందని,1,241 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వివరించారు.