నోట్​ క్యామ్​ యాప్తో.. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు చెక్

నోట్​ క్యామ్​ యాప్తో.. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు చెక్
  • ట్రక్ షీట్​​తో రైతు,  డ్రైవర్, సెంటర్ ఇన్​చార్జి గ్రూప్​ఫొటో కంపల్సరీ
  • సెంటర్, డేట్​, టైమ్ తో ‘నోట్​ క్యామ్​ యాప్’​ లో అప్ లోడ్  చేయాల్సిందే 
  • ప్రతి సెంటర్​కో ఫైల్.. ఫొటోతో సహా కొనుగోలు వివరాలు ఫీడ్​ 
  • పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సివిల్​ సప్లయ్స్​శాఖ

హైదరాబాద్​ / యాదాద్రి, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు  జరగకుండా సివిల్​ సప్లయ్స్​​ శాఖ​​ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఇతర ప్రాంతాల వడ్లను.. లోకల్​గా చూపించేందుకు మిల్లర్లు చేసే ప్రయత్నాలకూ అడ్డుకట్ట వేస్తున్నది. గతంలో మాదిరిగా దొంగ ట్రక్​ షీట్లు రాసి గోల్​మాల్​ చేసేందుకు వీలులేకుండా ఈ సారి ‘నోట్​ క్యామ్​’ యాప్​ను తీసుకొచ్చింది. 


ధాన్యం లారీ దగ్గర  ట్రక్ షీట్​తో రైతు,  డ్రైవర్, సెంటర్ ఇన్​చార్జితో గ్రూప్​ఫొటో తీసి.. సెంటర్, డేట్​, టైమ్ తో యాప్​లో అప్ లోడ్  చేయిస్తున్నది.  ఫలితంగా ధాన్యం అమ్ముకున్న రైతులు ఇటు నిర్వాహకుల చేతిలో, అటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.  యాసంగి సీజన్​లో రాష్ట్రంలో 56.49 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.  1.27 కోట్ల  టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సర్కారు అంచనా వేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 8,200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ నిర్ణయించగా.. ఇప్పటికే  2వేల సెంటర్లకు పైగా  ప్రారంభించారు.  లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. 

యాప్​తో అక్రమాలకు అడ్డుకట్ట ఇలా..

జియో ట్యాగింగ్​ చేసిన లారీలో ధాన్యం బస్తాలను లోడ్​ చేసి, బస్తాల సంఖ్యను  ట్రక్​ షీట్ లో నమోదు చేస్తారు. ఆ తర్వాత లారీ డ్రైవర్, కొనుగోలు సెంటర్​ ఇన్​చార్జ్​, అందుబాటులో ఉన్న రైతుతో కలిసి ట్రక్​ షీట్​ తో  ‘నోట్​ క్యామ్​ యాప్’ లో కొనుగోలు సెంటర్​ పేరు, తేదీ, టైమ్​ వచ్చేలా ఫొటోను దింపుతారు.  ఆ ఫొటోను సివిల్​ సప్లయ్స్​​ డిపార్ట్​మెంట్​ హెడ్​కు వాట్సాప్​లో పంపిస్తారు. ఆ ఫొటోను వడ్ల కొనుగోలు సెంటర్​ ఫైల్​లో భద్రపరుస్తారు.  ఇలా  ఎన్ని లారీల్లో ఏఏ మిల్లుకు ఏ రోజు ఎన్ని బస్తాల వడ్లు పంపించారో ఆ ఫైల్స్​లో వివరాలు ఫీడ్​ చేస్తారు. 

గతంలో ఇతర ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడే కొన్నట్టుగా కొందరు అక్రమ మిల్లర్లు దొంగ ట్రక్​ షీట్లు రూపొందించేవారు.  కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై   మద్దతు ధర పొందేవారు. అంతే కాకుండా తూకం తక్కువగా ఉందని, వడ్లు సరిగా లేవని కొర్రీలు పెట్టి లారీ లోడులో బస్తాలకు బస్తాలు కోత పెట్టేవారు. తాజాగా ‘నోట్​ క్యామ్​ యాప్​’ లో సెంటర్ పేరు, తేదీ, టైమ్​ వచ్చే విధంగా ఫొటోలు తీసి అప్​లోడ్​ చేస్తుండడంతో.. అక్రమ వ్యవహారాలకు చెక్​ పడుతున్నది. ఇక వడ్ల కొనుగోళ్లలో తూకంలో కోత పెట్టినా,  కాంటా పెట్టకున్నా, రైతులకు కొనుగోలు సెంటర్లలో  ఎలాంటి ఇబ్బంది ఎదురైనా.. రైతులు నేరుగా ఫోన్​ చేయడానికి ప్రత్యేక కాల్​ సెంటర్​ నంబర్​ 92814 23621 ను  ఏర్పాటు చేశారు. సెంటర్లలో ధాన్యం కాంటా పెట్టిన  తర్వాత బస్తాలకు రైతులకు ఇచ్చే టోకెన్​ నంబర్లు వేస్తున్నారు. 

అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు

వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నం. సెంటర్​ నుంచి లారీ ఎప్పుడు.. ఏ మిల్లుకు బయలు దేరింది.. అన్​లోడ్​ ఎప్పుడు జరిగింది వెంటనే తెలుసుకుంటున్నం. మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా నోట్​ క్యామ్​ యాప్​ ఉపయోగిస్తూ ఫొటోలు తీసుకుంటు న్నం. టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేసినం. ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి స్టాఫ్​ను ఏర్పాటు చేసినం.
- హరికృష్ణ, డీఎం,
సివిల్​ సప్లయ్స్​​, యాదాద్రి జిల్లా