వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్.. కాళేశ్వరం బంద్ అయినాపెరిగిన దిగుబడి

వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్..  కాళేశ్వరం బంద్ అయినాపెరిగిన దిగుబడి
  • కాళేశ్వరం బంద్ అయినాపెరిగిన దిగుబడి
  • సర్కారు పనితీరుకు ఇదే నిదర్శనం

హైదరాబాద్, వెలుగు: వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఈ వానాకాలం సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. మొత్తం 1.53 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని ఆయన ప్రకటించారు. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రాష్ట్ర రైతాంగం సాధించిన ఘన విజయమన్నారు.

ఆయన ఆదివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఏపీలో గానీ, తెలంగాణ ఏర్పడ్డాక గానీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి వచ్చిన సందర్భం లేదని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు పని చెయ్యక పోయినా వరి దిగుబడిలో అపూర్వమైన విజయాన్ని సాధించామని వెల్లడించారు. ప్రభుత్వంతో మమేకమైన రైతాంగం అంకిత భావంతో సాగు చేయడం వల్లే ఈ విజయం సాధ్యపడిందన్నారు. 

రికార్డ్ స్థాయిలో సాగును నమోదు చేసిన రాష్ట్ర రైతాంగానికి  ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ దిగుబడి దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిందని, ఈ ఘనత ముమ్మాటికీ రైతుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందనడానికి, సర్కారు పనితీరుకు రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.