హైదరాబాద్, వెలుగు: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ధాన్యం కొన్న మూడు నాలుగు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం వీ6 వెలుగుకు మంత్రి ఉత్తమ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసారి రికార్డు స్థాయిలో 66.70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఆయన తెలిపారు. 1.55 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని పేర్కొన్నారు. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,750 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ‘‘ధాన్యం ఒకేసారి మిల్లులకు రావడంతోనే మిర్యాలగూడ ప్రాంతంలో ఇబ్బంది ఏర్పడింది. మిర్యాలగూడలోని మిల్లులకు ఒకేసారి 6 వేల ట్రాక్టర్లు రావడంతో సమస్య తలెత్తింది. ఒకేసారి ఎక్కువ వెహికల్స్ రాకుండా టోకెన్సిస్టమ్ అమలు చేస్తున్నాం” అని తెలిపారు.
మిల్లింగ్ చార్జీలు పెంచినం..
గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.10 ఇచ్చేవారని.. తాము సన్నాలకు రూ.50, దొడ్డు రకాలకు రూ.40 చొప్పున మిల్లింగ్ చార్జీలను పెంచామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో సేకరించిన ధాన్యాన్ని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మిల్లర్ల వద్ద పెట్టారు. ఇదే అదనుగా కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని మాయం చేశారు. పక్క రాష్ట్రాల్లో మిల్లుల్లో పెట్టిన ధాన్యానికి 100 శాతం బ్యాంక్గ్యారంటీ అడుగుతున్నారు. రాష్ట్రంలో కేవలం 10, 20 శాతమే బ్యాంక్ గ్యారంటీ అమలు చేస్తున్నారు. అయినా కొంతమంది మిల్లర్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు. కొనుగోళ్లకు సహకరించడం లేదు. అందుకే 30 లక్షల టన్నుల కెపాసిటీతో గోదాములు సిద్ధం చేశాం. ఎక్కడ సమస్య ఉన్నా ఇంటర్మీడియెట్ గోదాముల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలోని మిల్లింగ్ కెపాసిటీ కంటే ఎక్కవ ధాన్యం వస్తే.. కర్నాటక, తమిళనాడులో మిల్లింగ్చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని చెప్పారు.
రూ.30 వేల కోట్లు సిద్ధం..
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 17 శాతం తేమ నిబంధన కేంద్రమే అమలు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లో ఉందని చెప్పారు. తేమ విషయంలో బీజేపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘ఆర్థికంగా భారమైనాసరే 30 లక్షల టన్నుల కెపాసిటీతో సిద్ధం చేసిన గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తం. రైతులందరికీ మద్దతు ధరతో పాటు సన్న రకాలకు రూ.500 బోనస్ఇస్తం. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సన్న రకాలే కొనుగోలు చేయడం లేదని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. కోటి 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు ప్లాన్‌చేసి, రూ.30 వేల కోట్లు సిద్ధం చేశామని చెప్పారు.