రైతుల ధాన్యమంతా సర్కార్ కొంటది

రైతుల ధాన్యమంతా సర్కార్ కొంటది
  • రైతులు, మిల్లర్ల మధ్య పరస్పర సహకారం అవసరం
  • మిల్లింగ్ చార్జీలను డబుల్ చేసిన  రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్ర సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్

నార్కట్​పల్లి, వెలుగు:  రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్​పల్లి వద్ద  పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్ ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్ల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నందని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో 2.81 కోట్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు.

దళారీల మాటలను మిల్లర్లు నమ్మవద్దని, మొదటిసారి మిల్లింగ్ చార్జీలను డబుల్ చేయడం జరిగిందని తెలిపారు.  దొడ్డు వడ్లకు రూ. 10 నుంచి రూ. 40,  సన్న వడ్లకు రూ. 50 మిల్లింగ్ చార్జీలు పెంచిందన్నారు. కేవలం 10% బ్యాంకు గ్యారం టీతో సీఎంఆర్ ఇవ్వడం జరుగుతున్నదని, ఇతర రాష్ట్రాల్లో ఇది వంద శాతం ఉందన్నారు. సీఎంఆర్ చెల్లించిన వెంటనే బ్యాంకు గ్యారంటీని రిలీజ్ చేస్తామన్నారు.

మిల్లర్లు బ్యాంకులో ఉన్న బాకీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని గుర్తించాలన్నారు. మిల్లర్లతో మాట్లాడుతూ 2024–  -25 ఏడాదికి ధాన్యం సేకరణ పై సబ్ కమిటీ ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి మీటింగ్ లో  రైతులను భాగస్వాములను చేశామన్నారు. మిల్లర్లు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్  జె. శ్రీనివాస్ , జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు , మేనేజర్ హరీశ్​, డీసీఓ పత్యానాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.