రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు : శశిధర్ రాజు

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు : శశిధర్ రాజు
  • చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్​ శశిధర్ రాజు
  • 431 క్వింటాళ్ల రేషన్ ​బియ్యం పట్టివేత
  • సాయి మహదేవ్ రైస్ మిల్ సీజ్

తొగుట, రాయపోల్, వెలుగు : రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్​ సప్లయీస్​ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్, ఆఫీసర్ శశిధర్ రాజు హెచ్చరించారు. గురువారం రాయపోల్ మండలం రామారం గ్రామ శివారులోని సాయి మహదేవ్ ఆగ్రోఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. 

431 క్వింటాళ్ల రేషన్​బియ్యాన్ని పట్టుకొని సీజ్​చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని మిల్లులో రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికే అందజేస్తున్నారన్నారు. ఈ మిల్లు ప్రభుత్వానికి 1660 టన్నుల బియ్యం బాకీ ఉండడంతో దాదాపు రెండు సీజన్లలో సీఎంఆర్ ఇవ్వలేదన్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్మినా కొన్న క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. 

మిల్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్న సాయి కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బియ్యాన్ని దౌల్తాబాద్ పౌర సరఫరాల గోదాంకు తరలించి నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశం, సీఐ పండరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరాజ్, రఘుపతి, ప్రేమ్ దీప్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ప్రవీణ్, జనరల్ మేనేజర్ రాఘవేందర్, డీసీఎస్ వో తనూజ, ఏఎస్ వో అనిల్ కుమార్ పాల్గొన్నారు.