వడ్ల నిల్వలకు చోటేది ? ..స్పేస్​ తక్కువ.. కొనుగోలు లక్ష్యం ఎక్కువ

వడ్ల నిల్వలకు చోటేది ? ..స్పేస్​ తక్కువ.. కొనుగోలు లక్ష్యం ఎక్కువ
  • మిల్లర్లకు కేటాయింపు నో ఇతర జిల్లాలకు నో
  • కొనుగోలు చేసే వడ్లు జిల్లాలోని గోదాములకే

యాదాద్రి, వెలుగు : కొనుగోలు చేసిన వడ్ల నిల్వపై సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ కు ఇబ్బందులు తప్పడం లేదు.  మిల్లులకు కేటాయింపులు లేకపోవడంతో సెంటర్లలో  కొనుగోలు చేస్తున్న వడ్లను నేరుగా గోదాములకు తరలించాల్సి వస్తోంది.  స్పేస్​ తక్కువగా ఉండడం,  ఇతర జిల్లాలకు వడ్లను  పంపే అనుమతి లేకపోవడంతో వడ్లను ఎక్కడ నిల్వ చేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. 

యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్​లో 2.85 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు.  దాదాపు 6 లక్షల టన్నుల వడ్ల దిగుబడి అంచనాతో..  సెంటర్లకు నాలుగు లక్షల టన్నుల వడ్లు వస్తాయని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా జిల్లాలో సన్నవడ్లకు 47 సెంటర్లు, దొడ్డు వడ్ల కోసం 322 సెంటర్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధం అయ్యారు. 

మిల్లర్లకు కేటాయింపులు లేవు.. 

బ్యాంక్​ ష్యూరిటీ చూపించిన మిల్లర్లకే సీఎంఆర్​ కోసం వడ్లను కేటాయిస్తామని సర్కారు గతంలోనే ప్రకటించింది. అయితే మిల్లర్లు తాము ష్యూరిటీ ఇవ్వమని చెప్పడంతో పాటు మరికొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చి వాటిని తీర్చే వరకూ తాము వడ్లను దించుకోమని ప్రకటించారు. దీంతో వానాకాలం సీజన్​ వడ్లను కొనుగోలు చేస్తున్నా.. మిల్లులను ట్యాగ్​ చేయలేదు.  కొనుగోలు చేసిన వడ్లను గోదాములకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

ఇతర జిల్లాలకు పంపొద్దు

 రెండు సీజన్లలో కొనుగోలు చేసిన వడ్లను నిల్వ చేయడానికి జిల్లాలో స్పేస్ లేకపోవడంతో జనగామ, వరంగల్​, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మిల్లులకు తరలించారు.  జిల్లాకు సంబంధించిన వడ్లను ఇతర జిల్లాలకు పంపడమేమిటీ..? అంటూ సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ హయ్యర్​ ఆఫీసర్లు సీరియస్​ అయ్యారు. ఈ సీజన్​లో యాదాద్రి జిల్లా వడ్లు ఇక్కడే నిల్వ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. 

స్పేస్​ లక్ష టన్నులు.. కొనుగోలు లక్ష్యం నాలుగు లక్షల టన్నులు 

యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ గోదాముల్లో 3.30 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేయడానికి సరిపడా స్పేస్​ ఉంది. అయితే ఈ గోదాముల్లో గత సీజన్లకు సంబంధించిన వడ్లు 2.30 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి. ఇక వీటి పరిధిలో ఇంకా లక్ష టన్నులు నిల్వ చేయడానికి అవసరమైన స్సేస్​ ఉంది. ఈ సీజన్​లో నాలుగు లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

దీంతో మిగిలిన మూడు లక్షల టన్నుల వడ్లను ఎక్కడ నిల్వ చేయాలన్న అంశంపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే జిల్లాలోని మార్కెట్​ కమిటీలకు చెందిన గోదాముల్లో 72,400 టన్నుల సామర్థ్యం కలిగి ఉండగా ఇందులో దాదాపు 60 వేల టన్నులకు పైగా స్పేస్​ను మిల్లర్లు అద్దెకు తీసుకున్నారు. దీంతో మిల్లర్లను ఖాళీ చేయించాలని ఆఫీసర్లు ఆదేశించారు. అయితే మిల్లర్లు తాళాలు ఇవ్వడం లేదంటూ కొందరు మార్కెట్​ కమిటీ సెక్రటరీలు సాకులుచెబుతున్నారని తెలుస్తోంది. దీంతో సీరియస్​ అయిన ఆఫీసర్లు.. అవసరమైతే తాళాలు పగలగొట్టాలని ఆదేశించినట్టుగా సమాచారం. 

కొనుగోళ్లు పుంజుకునే లోగా:

వడ్లను నిల్వ చేయడానికి స్పేస్​ తక్కువగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతానికి లక్ష టన్నులకు పైగా స్పేస్​ అందుబాటులో ఉంది. కొనుగోళ్ల చేసిన వడ్లన ప్రస్తుతం మార్కెట్​ కమిటీ గోదాములకు తరలిస్తున్నాం. వడ్ల కొనుగోళ్లు పుంజుకునే సమయానికి అవసరమైన స్పేస్​ను అందుబాటులోకి తెస్తాం. -జగదీశ్వర్​​, డీఎం, సివిల్​ సప్లయ్​