- పెండింగ్‌లో 61 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్
- పత్తాలేని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్
- బియ్యం ఇవ్వని మిల్లులకే తిరిగి వడ్లు ఇవ్వడంపై అనుమానాలు
నాగర్ కర్నూల్, వెలుగు: ప్రభుత్వం నుంచి తీసుకున్న వడ్లు పట్టించి ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ టార్గెట్ పూర్తి చేయాలని సివిల్ సప్లై ఆఫీసర్లు మిల్లుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మిల్లర్లకు ఇచ్చిన వడ్లు, స్టాక్, ఎఫ్‌సీఐకి పెట్టిన బియ్యం వివరాలు సేకరించాల్సిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2023 ఖరీఫ్, రబీలో కలిపి 1,38,653 మెట్రిక్ టన్నుల వడ్లు జిల్లాలోని 109 మిల్లులకు ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 42,986 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇచ్చారు.
ఇంకా 49,961 మెట్రిక్ టన్నుల బియ్యంరావాల్సి ఉంది. అలాగే 2021 ఖరీఫ్, యాసంగికి సంబంధించి 11,800 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే సీఎంఆర్ ఇవ్వని మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, పీడీఎస్ బియ్యం రీసైకిల్ చేస్తూ పట్టుబడిన మిల్లులపై కేసులు పెట్టాలన్న నిబంధనలున్నా సివిల్సప్లై ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2021 యాసంగికి సంబంధించి11,800 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉన్నా, వాటిని పాత బకాయి కింద జమకట్టారు. కల్వకుర్తి ప్రాంతంలోని రెండు మిల్లుల్లో ఒకరి నుంచి 8 వేల మెట్రిక్ టన్నులు, మరో మిల్లర్ నుంచి 3,800 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రెండేండ్ల నుంచి పెండింగ్‌లో ఉంది.
పెండింగ్ ఉన్నా..
గత ప్రభుత్వంలో సివిల్సప్లై అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తిరిగి వడ్లు కేటాయించేలా చూసుకున్నారు. 2023లో రెండు సీజన్లకు కలిపి కేవలం 42 శాతం మాత్రమే సీఎంఆర్ ఎఫ్‌సీఐకి చేరింది. ఈ ఏడాదికి సంబంధించి 49,961 మెట్రిక్ టన్నులు, 2021 యాసంగికి సంబంధించి 11,800 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీనికి ఈ నెల 31 చివరి గడువుగా నిర్ణయించారు. 2022 యాసంగి వడ్లకు సంబంధించిన సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది.
మూడు సీజన్లకు సంబంధించి దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, మిల్లులు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. 2022లో జిల్లాలో 53 రైస్ మిల్లులు ఉంటే, గత ఏడాది ఏకంగా 55 కొత్త మిల్లులు వచ్చాయంటే బియ్యం దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మిల్లర్లకు వడ్లు ఇచ్చిన ప్రభుత్వం సీఎంఆర్‌కు అడిగినంత టైం ఇచ్చింది.
వారానికో మీటింగ్ పెట్టినా..
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పీడీఎస్ రైస్ రీ సైక్లింగ్, సీఎంఆర్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి రివ్యూ అయిపోగానే, కలెక్టర్ ఉదయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సీతారామరావు వేర్వేరుగా మీటింగ్స్ పెడుతున్నారు. సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిల్లర్లతో మాట్లాడుతున్నారు. గడువులోగా సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవనే వార్నింగ్ ఇస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. రెండు నెలల్లో 8 శాతం సీఎంఆర్ మాత్రమే రాబట్టగలిగారు. ఇదిలాఉంటే 2021 కంటే ముందు పెండింగ్ సీఎంఆర్‌ను లెక్కలు చూపకుండా దాటేస్తున్నారు.