- గద్వాల జిల్లాలో రూ.కోట్లలో సీఎంఆర్ వడ్ల కుంభకోణం
- రెండేండ్ల నుంచి బియ్యం పెట్టకున్నా పట్టించుకోని ఆఫీసర్లు
- రైస్ మిల్లులను లీజుకు తీసుకొని పక్కా ప్లాన్ తో కోట్లు నొక్కేసిన అక్రమార్కులు
- ఇన్ చార్జి డీటీలు, సివిల్ సప్లై ఆఫీసర్లపై అనుమానాలు
గద్వాల, వెలుగు: రెండేండ్ల నుంచి రైస్ మిల్లర్లు సీఎంఆర్ రైస్ ఇవ్వకున్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఇటీవల సివిల్ సప్లై ఆఫీసర్లు మూడు రైస్ మిల్లులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. కేసులు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కింద మంత్రి జూపల్లి ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఈ విషయంపై చర్చించారు. 2021– 22 యాసంగికి సంబంధించి 19,106 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను, 10,491 మెట్రిక్ టన్నులు మాత్రమే పెట్టారు. ఇంకా 8,853 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇలా కోట్ల విలువ చేసే బియ్యాన్ని రెండేండ్లుగా ఇవ్వడం లేదు. ఇందులో మూడు రైస్ మిల్లులకు సంబంధించి రూ.20 కోట్లకు పైగా బియ్యం పెట్టాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
కేసులతో సరి..
ఐజలోని అన్నపూర్ణ రైస్ మిల్ 60 ఏసీకేలకు(ఒక ఏసీకే 290 క్వింటాళ్ల బియ్యం) గాను 2 ఏసీకేలే పెట్టారు. గద్వాల మండలం కాకులారంలోని శ్రీకృష్ణ రైస్ మిల్ 29 ఏసీకేలు పెట్టాల్సి ఉండగా, రెండు ఏసీకేలు ఇచ్చారు. శాంతినగర్ లోని సూర్య రైస్ మిల్ 37 ఏసీకేలకు గాను, 12 ఏసీకేలు మాత్రమే పెట్టారు. వేంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్ 115 ఏసీకేలకు గాను కేవలం 25 ఏసీకేలు మాత్రమే పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన వడ్లను అమ్ముకొని లెవీ బియ్యం పెట్టడం లేదని అప్పటి డీఎం ప్రసాద్ రావు సంబంధిత పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు.
ఇదిలాఉంటే రికవరీ ఎలాగనే విషయంపై ఆఫీసర్లకు క్లారిటీ లేకుండా పోయింది. రైస్ మిల్లులను సీజ్ చేద్దామంటే ఓనర్లు వేరే వారు కావడం, లీజు గడువు తీరిపోవడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేసి అమ్మినా సీఎంఆర్ బియ్యంలో 60 శాతం కూడా రికవరీ కావని అంటున్నారు.
పక్కా ప్లాన్ తో..
సివిల్ సప్లై శాఖలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని కొందరు ఆఫీసర్లు రైస్ మిల్లు లేకున్నా లీజు డాక్యుమెంట్లు పెట్టుకొని రూ. కోట్ల సీఎంఆర్ వడ్లకు పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గవర్నమెంట్ కేటాయించిన వడ్లకు బియ్యం లెవీ కింద పెట్టకుండా వడ్లను అమ్ముకొని ఆ డబ్బును రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. రూ.20 కోట్ల బియ్యం బాకీ పడ్డారు. గడువు తీరిపోయినా 30 శాతం బియ్యం ఇంకా రావాల్సి ఉంది.
జిల్లాలో 8 రైస్ మిల్లులను లీజుకి తీసుకొని సీఎంఆర్ వడ్లను కేటాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా లీజుదారులకు సీఎంఆర్ వడ్లు పెద్ద ఎత్తున పెట్టకూడదు. వడ్లకు సరిపడా షూరిటీ ఉంటేనే ఇవ్వాల్సి ఉన్నా ఇవేవీ పట్టించుకోకుండా వడ్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలోని 55 మిల్లులకు వడ్లు ఇవ్వగా, అందులో 12 మంది రైస్ మిల్లర్లు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. 55 రైస్ మిల్లులకు డీటీలను ఇన్ చార్జీలుగా నియమించారు. వీరు రైస్ మిల్లులను తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. లెవీ బియ్యం ఇవ్వకుండా వడ్ల దందాకు మిల్లర్లు తెర లేపినా డీటీలు రిపోర్ట్ ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్లర్లు చేసిన కుంభకోణంలో డీటీల పాత్ర కూడా ఉందనే ఆరోపణలున్నాయి.
బియ్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు..
మిల్లర్లు సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని ఇటీవల రివ్యూ మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. గడువులోగా బియ్యం పెట్టాలని, ప్రతిరోజు 20 ఏసీకేల బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. బియ్యం పెట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పూర్తి బియ్యం ఇవ్వని మిల్లర్లు..
గద్వాల జిల్లాలో 50 రా రైస్ మిల్లులకు, 5 బాయిల్డ్ రైస్ మిల్లులకు సివిల్ సప్లై ఆఫీసర్లు సీఎంఆర్ వడ్లు ఇచ్చారు. 2021–22 యాసంగికి గాను 19,106 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 10,491 టన్నులు ఇచ్చారు. ఇంకా 8,853 మెట్రిక్ టన్నులు పెట్టాల్సి ఉంది. 2022– 23 వానాకాలం సీజన్ లో 28,904 మెట్రిక్ టన్నులకు గాను 19,978 మెట్రిక్ టన్నులు పెట్టగా.. ఇంకా 5,662 మెట్రిక్ టన్నుల రైస్ రావాల్సి ఉంది. 2022–-23 యాసంగికి సంబంధించి 24,684 టన్నులకు గాను, కేవలం 1,131 మెట్రిక్ టన్నుల రైస్ మాత్రమే పెట్టారు. గడువు అయిపోయినా బియ్యం ఇవ్వకపోవడంతో సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించారని అర్థమవుతోంది.