
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సివిల్ సప్లై ఆఫీసర్లు
- ఇప్పటి వరకు కొన్నది 4,400 క్వింటాళ్లు, మిల్లులకు చేరింది 2 వేల క్వింటాళ్లు
- వర్షం భయంతో ప్రైవేట్ వ్యాపారులకుఅమ్ముకుంటున్న రైతులు
- మద్దతు ధరతో పాటు బోనస్ లాస్
గద్వాల, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోలులో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చినా కొనుగోలు చేయకపోవడంతో, వర్షం భయంతో రైతులు తమ వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ఇచ్చే బోనస్ నష్టపోతున్నారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో 69 సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇప్పటివరకు 45 సెంటర్లు ఓపెన్ చేశారు. ఈ సెంటర్లలో ఇప్పటి వరకు 4,400 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. వీటిలో 2 వేల క్వింటాళ్లు మాత్రమే రైస్ మిల్లులకు తరలించారు.
9 మిల్లులే గ్యారంటి ఇచ్చినయ్..
యాసంగిలో కొన్న వడ్లను 37 రైస్ మిల్లులకు తరలించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 9 రైస్ మిల్లులు మాత్రమే గ్యారెంటీ ఇచ్చాయి. మిగిలిన రైస్ మిల్లుల ఓనర్లు ఇంకా గ్యారెంటీ ఇవ్వకపోవడంతో ఒప్పందం చేసుకోలేదు. ఇక యాసంగిలో పంట దిగుబడిపై సివిల్ సప్లై, అగ్రికల్చర్ ఆఫీసర్లు వేర్వేరు ప్రకటనలు చేయడం, వారి మధ్య సమన్వయం లేదనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. సివిల్ సప్లై ఆఫీసర్లు లక్ష మెట్రిక్ టన్నులు లక్ష్యమని చెబుతుండగా, అగ్రికల్చర్ ఆఫీసర్లు మాత్రం జిల్లాలో 84 వేల ఎకరాల్లో వరి సాగయిందని, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
45 సెంటర్లే ఓపెన్ చేశారు..
జిల్లాలో యాసంగి వడ్లు కొనేందుకు 69 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నా, 45 సెంటర్లు ఓపెన్ చేశారు. వాటిలో కూడా నామమాత్రంగా వడ్లు కొనుగోలు చేస్తుండడంతో, రైతులు వర్షం పడితే వడ్లు నాని పోతాయని భయపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సెంటర్ కు వడ్లు తీసుకొచ్చినా.. కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తుండడంతో రైతులు చేసేది లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి రూ.2,100 మాత్రమే చెల్లిస్తున్నారు. మద్దతు ధర రూ.2,320తో పాటు ప్రభుత్వం ఇచ్చే బోనస్ రూ.500 కలుపుకుంటే రైతుకు క్వింటాల్‌కు రూ.2,820 గిట్టుబాటు అవుతుంది. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.820 వరకు రైతులు లాస్ అవుతున్నారు.
రైస్ మిల్లులు గ్యారంటీ ఇయ్యలే..
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయక ముందే మిల్లర్లతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, జోగులాంబ జిల్లాలో 37 రైస్ మిల్లులు వడ్లు పొందేందుకు అర్హత ఉన్నా, ఇప్పటి వరకు 9 రైస్ మిల్లులు మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు అగ్రిమెంట్ చేసుకున్నాయి. కొందరు మిల్లర్లు డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికీ, బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోవడంతో అగ్రిమెంట్ చేయలేదు.
నామమాత్రంగా కొనుగోళ్లు..
ఈ యాసంగిలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని సివిల్ సప్లై అధికారులు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, ఇప్పటి వరకు 4,400 కింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇది టార్గెట్ కు చాలా దూరంగా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్లు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే ఇంకా ఎక్కువ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అన్ని సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోళ్లలో వేగం పెంచితే తప్ప టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆ దిశగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు స్పీడప్ చేస్తాం..
టార్గెట్ మేరకు వడ్లు కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం 45 సెంటర్లు ఓపెన్ చేశాం. మిగిలిన సెంటర్లను ఓపెన్ చేసి కొనుగోళ్లను స్పీడప్ చేస్తాం. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
విమల, సివిల్ సప్లై డీఎం