రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు

ములుగు, వెలుగు :  సీఎంఆర్‌ను సొంతానికి వాడుకొని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిన ములుగులోని సాయి సహస్ర రైస్‌మిల్లుపై సివిల్‌ సప్లై ఆఫీసర్లు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులో వడ్లు, రికార్డులను తనిఖీ చేశారు. రైస్​మిల్​యాజమాన్యం రూ.12కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, రోజులు గడుపుతూ ప్రైవేటుగా వ్యాపారం చేసుకుంటున్నాడని సివిల్​ సప్లై డీఎం రాంపతి వెల్లడించారు.

సిబ్బందితో కలిసి రైస్​ మిల్లును సందర్శించిన డీఎం మిల్లులో ప్రస్తుతం ఎంత నిల్వలు ఉన్నాయో పరిశీలించారు. మొత్తం రూ.6కోట్ల విలువగల ధాన్యం ఉండటంతో రైస్​మిల్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో వాటిని సీజ్​ చేశారు. మిగిలిన సొమ్ము కోసం మిల్లు యజమానికి సంబంధించిన ఆస్తుల రికవరీకి రికమండ్​ చేయనున్నట్లు డీఎం మీడియాతో వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైడింగ్​ నిర్వహించామని తెలిపారు.

ఈ మిల్లులో రైతులెవరూ కూడా ధాన్యాన్ని అమ్మకూడదని డీఎం పేర్కొన్నారు. కాగా, సివిల్ సప్లై అధికారుల తీరుతో మిల్లు యజమానికి అమ్మిన ధాన్యానికి డబ్బులు ఎవరు ఇస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.