తప్పుడు పత్రాలతో టెండర్లు

తప్పుడు పత్రాలతో టెండర్లు
  •     సీఎంఆర్​ వడ్ల కోసం మిల్లర్ల ఎత్తులు
  •     ఆన్​లైన్​ పరిశీలనలో గుర్తించిన ఆఫీసర్లు
  •     యంత్రాలు లేకుండానే గతంలో కేటాయింపు

వనపర్తి, వెలుగు : సీఎంఆర్​ ఎగ్గొట్టి బ్లాక్​లిస్ట్ లో పడిన రైస్​మిల్లర్లు వచ్చే సీజన్​లోనూ వడ్ల కోటా పొందడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి తప్పుడు పత్రాలతో కొత్త మిల్లుల పేరుతో టెండర్లు వేసినట్టు తెలుస్తోంది. గడువు ముగిసినా ఎఫ్​సీఐకి సీఎంఆర్​ అందించకుండా మొండికేస్తున్న రైసుమిల్లర్లపై చర్యలు తీసుకుంటున్న ఆఫీసర్లు కొన్ని మిల్లులను సీజ్​ చేశారు.

2024– -25 వానాకాలం సీజనులో వచ్చే వరి ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించేందుకు సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు ఇటీవల కలెక్టరేట్​లో టెండర్లు నిర్వహించారు. మిల్లులు సీజ్​ అయిన వారిలో కూడా కొంతమంది వేరే పేర్లతో ధాన్యం కేటాయింపుల కోసం టెండర్లు వేసి.. కోటా దక్కించుకున్నట్టు సమాచారం. 

కాగితాల్లోనే మిల్లులు 

జిల్లాలో ఏడాదికేడాది కొత్త రైసుమిల్లులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా ఆఫీసర్లు డిఫాల్టర్లుగా గుర్తించడం వల్ల అయిదారు మిల్లులు మూతబడుతున్నాయి. వాటి స్థానంలో కొత్త పేర్లతో మిల్లులు ఏర్పాటవుతున్నాయి. కొన్ని మిల్లులు కాగితాల మీదనే ఉంటున్నాయి. ఈ దందాలో కొందరికి డిపార్టుమెంట్​ ఆఫీసర్లు సహకరిస్తుంటే.. మరికొందరికి ప్రజాప్రతినిధుల అండదండలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 166 రా రైస్ మిల్లులు, ఆరు పారాబాయిల్డ్​ రైసు మిల్లులు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో ఈ మిల్లులకు ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లింగ్​చేసేందుకు కేటాయిస్తారు. నిరుడు కొత్తగా ఏర్పాటయిన మిల్లుకు లక్షల సంచుల వరి ధాన్యం కేటాయించారు.

ఆఫీసర్లు అక్కడికెళ్లి చూస్తే యంత్రాలే లేకపోవడంతో అవాక్కయ్యారు. అప్పటికే మిల్లర్​ ధాన్యాన్ని బయటి ప్రాంతాలకు తరలించినట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు అధికారులు చర్యలకు సిద్ధపడగానే కోర్టులకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. సీఎంఆర్​ బకాయి పడ్డ మిల్లర్ల ఆస్తులను ఆర్​ ఆర్​ యాక్టు కింద ఇటీవల ఆఫీసర్లు జప్తు చేయగా అతడు స్టే తెచ్చుకున్నాడు. 

 రిజిస్ట్రేషన్​ లేని ఫర్మ్​లు

తాజాగా వానాకాలం సీజనుకు సంబంధించి తమకు వరి ధాన్యం కేటాయించాలంటూ టెండర్లు సమర్పించిన మిల్లర్లలో కొందరు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. టెండర్​ వేసిన ఒక ఫర్మ్​ వివరాలను ఆన్​లైన్​లో పరిశీలిస్తే ఆ పేరు మీద ఏ సంస్థ రిజిస్ట్రేషన్​ కాలేదని తేలింది. ఫర్మ్​ రిజిస్ట్రేషన్​, పార్ట్​నర్ల వివరాలు ఉంటేనే వడ్లు కేటాయించాలన్న నిబంధనాలున్నాయి. కానీ కొందరు అధికారులు ఇవేమీ చెక్​ చేయకుండానే కేటాయింపులు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ సారి కూడా ఎవరూ చూడొచ్చారులే అన్న ధీమాతో రిజిస్ట్రేషన్​ లేని ఫర్మ్​పేర టెండర్లు వేసినట్టు భావిస్తున్నారు. 

 రిజిస్ట్రేషన్​ లేకుంటే రిజెక్ట్​ 

ఫర్మ్​, పార్ట్​నర్స్​ రిజిస్ట్రేషన్​ లేకుండా టెండరు దరఖాస్తు చేసినట్లు కొన్నింటిని గుర్తించాం. అలాంటి మిల్లర్ల టెండరు దరఖాస్తులను ఒకటికి రెండు సార్లు పరిశీలించి తొలగిస్తున్నాం. వారికి ధాన్యం కేటాయించబోం.

- ఇర్ఫాన్​, సివిల్​ సప్లయి డీఎం