మెదక్ జిల్లాలో సీఎంఆర్ సరఫరాపై అధికారుల ఫోకస్

మెదక్ జిల్లాలో సీఎంఆర్ సరఫరాపై అధికారుల ఫోకస్
  • ఇప్పటి వరకు మిల్లర్లు ఇచ్చింది 69.41 శాతమే.. 
  • మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్న ఆఫీసర్లు

మెదక్, వెలుగు: కస్టం మిల్లింగ్ రైస్​(సీఎంఆర్) ఇవ్వడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ధాన్యం తీసుకుంటున్నా టార్గెట్ మేరకు సీఎంఆర్ ఇవ్వడం లేదు. దీంతో సివిల్​సప్లై అధికారులు సంబంధిత మిల్లర్ల నుంచి సీఎంఆర్​సేకరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ మేరకు మిల్లర్ల నుంచి బ్యాంక్​ గ్యారంటీ తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో 2023 – -24 వానాకాలం, యాసంగి, 2024–-25 వానాకాలం సీజన్ లో రైస్ మిల్లులకు 7,88,743 టన్నుల ధాన్యం సరఫరా చేశారు. 

రైస్ మిల్లర్లు 5,31,053 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్​ 1,52,920  టన్నులు, రా రైస్​1,60,140 టన్నులు, సన్నాలు ఎస్పీఆర్​ 14, 111 టన్నులు, సెంట్రల్​ 41,281 టన్నులు కలిసి మొత్తం 3,68,624  టన్నుల (69.41 శాతం) సీఎంఆర్ మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,62,424 టన్నులు బ్యాలెన్స్​ఉంది.  సీజన్ల వారీగా 2023 –-24 వానాకాలం సీజన్​కు  సంబంధించి 1,79,709 మెట్రిక్​ టన్నులు ( 99.43 శాతం), 2023-–24 యాసంగి సీజన్​కు సంబంధించి 1,45,022  టన్నులు (84.91శాతం), 2024 –-25 వానాకాలానికి సంబంధించి 43,891 టన్నులు (24.45 శాతం) సీఎంఆర్​ సరఫరా జరిగింది.  

ప్రస్తుతం జిల్లాలోని రైస్​ మిల్లుల్లో 2,42,432 మెట్రిక్​ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంది. 2024 –-25 వానాకాలం సీజన్​ కు సంబంధించి 94 రైస్​మిల్లులు, 2023 –-24 యాసంగి సీజన్​కు సంబంధించి 38 రైస్​ మిల్లులు, వానాకాలం 2023 –-24 సీజన్​కు సంబంధించి 4 రైస్​ మిల్లులు సీఎంఆర్​ బకాయి ఉన్నాయి. ఈ మేరకు సివిల్​ సప్లై అధికారులు సీఎంఆర్​ బకాయి ఉన్న రైస్​ మిల్లర్ల నుంచి గడువులోగా సీఎంఆర్​ సేకరించేలా బ్యాంక్​ గ్యారంటీ తీసుకుంటున్నారు. 2024 –- 25 వానాకాలం సీజన్​కు సంబంధించి 13 మంది రైస్​ మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ సబ్మిట్​ చేశారు. ఇవి పోను ఇంకా 81 మంది మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ సబ్మిట్​ చేయాల్సి ఉంది. 

అడిషనల్​ కలెక్టర్​ రివ్యూ

బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అడిషనల్​ కలెక్టర్ నగేశ్  ఆదేశించారు. ఇటీవల ఆయన కలెక్టరేట్ సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్స్, రైస్ మిల్లర్స్ తో సమీక్ష నిర్వహించారు. గడువు లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని మిల్లర్లకు సూచించారు. బ్యాంక్ గ్యారంటీలు అందజేయడంలో బ్యాంకర్లు వేగం పెంచాలని చెప్పారు.