397 మిల్లుల్లో వడ్లు లేవు..వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు

397 మిల్లుల్లో వడ్లు లేవు..వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు
  • ఏజెన్సీల కంప్లైంట్​తో తనిఖీలకు సివిల్ సప్లయ్ సిద్ధం
  • మూడు సీజన్ల వడ్ల లెక్కింపు 
  • వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు
  • చెల్లించని మిల్లులపై కేసుల నమోదు

యాదాద్రి, వెలుగు: మిల్లుల్లో సీఎంఆర్​ వడ్లు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని తేల్చేందుకు సివిల్​ సప్లయ్​ డిపార్ట్​​మెంట్​ సిద్ధమైంది. టెండర్​లో దక్కించుకున్న వడ్లను లిఫ్ట్​ చేయడానికి మిల్లుల వద్దకు వెళ్తే, అక్కడ స్టాక్​ లేదని మూడు ఏజెన్సీలు సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు ఫిర్యాదు చేశాయి. దీంతో  ఎంపిక చేసిన మిల్లుల్లో తనిఖీలు నిర్వహించడానికి డిపార్ట్​మెంట్​ సిద్ధమైంది. సోమవారం నుంచి తనిఖీలు ప్రారంభించి ఈ నెలాఖరులోగా  మిల్లుల్లో వడ్ల స్టాక్​ లెక్కలు తీయనున్నారు.

మిల్లుల్లో వడ్లు లేవ్..

యాసంగి 2022–-23 సీజన్​లో  అప్పగించిన వడ్లకు సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఆ తర్వాత సీఎంఆర్​ కోసం వడ్లు ఇస్తున్నా బియ్యం అప్పగించడంలో మిల్లర్లు జాప్యం చేస్తూనే ఉన్నారు. ఇలా 28 జిల్లాల్లోని 1,832 మిల్లుల్లో దాదాపు 34.59 లక్షల టన్నుల వడ్ల స్టాక్​ ఉండిపోయింది.  దీంతో ఈ ఏడాది జనవరిలో ఈ టెండర్లు పిలిచి, ఏ మిల్లులో ఎంత వడ్లు ఉన్నాయో పేర్కొన్నారు. పలు సంస్థలు వడ్లను టెండర్​లో దక్కించుకున్నాయి. టెండర్లలో వడ్లు దక్కించుకున్న సంస్థలు మిల్లుల నుంచి స్టాక్​ లిఫ్ట్​ చేయడానికి వెళ్లాయి. అయితే అనేక మిల్లులు తమకు సీఎంఆర్​ కోసం ఇచ్చిన వడ్లను అమ్ముకొని సొమ్ము చేసుకోవడంతో టెండర్​లో పేర్కొన్నట్లుగా వడ్ల స్టాక్​ లేదు. టెండర్​ ఏజెన్సీకి వడ్లను అప్పగించడానికి స్టాక్​ లేకపోవడంతో కొందరు మిల్లర్లు తాము పెండింగ్​లో ఉంచిన స్టాక్​కు విలువ లెక్కించి ఆ డబ్బును టెండర్​ దక్కించుకున్న సంస్థలకు చెల్లించారు. అయినా ఇంకా చాలా మొత్తం పెండింగ్​లోనే ఉంది. సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, నారాయణపేట, నల్గొండ, మెదక్, యాదాద్రి, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని రైస్​ మిల్లుల్లో టెండర్​ వడ్లు లేవు. 

ఏజెన్సీల కంప్లైంట్..

వడ్లను లిఫ్ట్​ చేయడానికి స్టాక్​ లేకపోవడంతో టెండర్​ దక్కించుకున్న ఏజెన్సీలు సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు చేసిన వాటిలో కేంద్రీయ బండార్, ఎన్ఏసీవోఎఫ్, మంచుకొండ ఆగ్రోటెక్​ ఏజెన్సీలు ఉన్నాయి. 

మూడు సీజన్ల వడ్ల లెక్కింపు..

ఏజెన్సీ ఫిర్యాదుతో సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ తనిఖీలకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న 397 రైస్​ మిల్లుల్లో సివిల్​ సప్లయ్​ డీఎం, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్​తో పాటు టెండర్​ దక్కించుకున్న ఏజెన్సీ ప్రతినిధి తనిఖీల్లో పాల్గొంటారు. 2022–-23 యాసంగి సీజన్​ తర్వాత ఆయా మిల్లులకు ఇచ్చిన వడ్ల స్టాక్​ను లెక్కించి రిపోర్ట్​ రెడీ చేసి మిల్లర్​ నుంచి సంతకం తీసుకుంటారు. ఆయా మిల్లులకు కేటాయించిన స్టాక్​ సరిగా ఉంటే సరే.. లేదంటే స్టాక్​కు సమానమైన సొమ్మును చెల్చించాల్సి ఉంటుంది. సొమ్ము చెల్లించని మిల్లులపై క్రిమినల్​ కేసులు పెడతామని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్​ ఒకరు తెలిపారు. హన్మకొండ జిల్లాలో 5, జనగామలో 2, భూపాలపల్లిలో 4, కరీంనగర్ లో 23, మహబూబాబాద్ లో 8, మంచిర్యాలలో 11, మెదక్ లో​27, నల్గొండలో 21, నిర్మల్ లో 25, నిజామాబాద్ లో 31, సిద్దిపేటలో 14, వరంగల్ లో​9, యాదాద్రిలో 15, జగిత్యాలలో 26, పెద్దపల్లిలో 12, భద్రాద్రికొత్తగూడెంలో 1, జోగులాంబగద్వాలలో 2, కామారెడ్డిలో 30, ఖమ్మంలో 1, మహబూబ్​నగర్ లో 15, ములుగులో 4, నాగర్​ కర్నూల్​లో 15, నారాయణపేటలో 17, రాజన్న సిరిసిల్లలో 12, సంగారెడ్డిలో 10, సూర్యాపేటలో 27, వికారాబాద్​లో 5, వనపర్తి జిల్లాలో 25 మిల్లులు వడ్ల బకాయి ఎక్కువగా ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.